- జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్
ఆసిఫాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆసిఫాబాద్జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, కేంద్రాల్లో ఏర్పాట్లు, మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను వసూలు అంశాలపై సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు, వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసిఫాబాద్ లో 20 వార్డులు, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలో ఇంటి పన్ను, ఇతర పన్నులు 100 శాతం వసూలు చేయాలని, అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు గజానన్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
