1687లో గొప్ప ఆంగ్ల శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ఇలా అన్నాడు ‘ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది’. ఆయన చెప్పిన కొటేషన్ 350 సంవత్సరాల తర్వాత నేటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వర్తమాన వ్యవహారాలకు వర్తిస్తుంది. జనవరి 3, 2026న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.. వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఒక ప్రధాన అంతర్జాతీయ సంఘటనగా ప్రపంచ దేశాల్లో సంచలనం సృష్టించింది.
ప్రస్తుతం అమెరికా అధీనంలో మదురో ఉన్నారు. వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మదురో 2013లో అధికారంలోకి వచ్చారు. వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు, ఆర్థిక , అధికార దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘనలకు మదురో పాల్పడ్డారని అమెరికా, యూరప్ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి.
అందుకే అమెరికా, యూరప్ నికోలస్ మదురోను వెనిజువెలా ప్రెసిడెంట్‌గా గుర్తించేందుకు అంగీకరించలేదు. నికోలస్ మదురో ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి ట్రంప్ నిరాకరించారు. మరోవైపు మదురో చైనా, రష్యా, క్యూబా, ఇరాన్ తదితర అమెరికా వ్యతిరేక దేశాలకు దగ్గరవడం ట్రంప్ ఆగ్రహానికి గురిచేసింది.
మదురో చైనాను వెనెజువెలా చమురు పరిశ్రమలోకి ప్రవేశించడానికి అనుమతించాడు. వెనెజువెలాపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చైనా బిలియన్ల కొద్దీ రుణాలు ఇచ్చింది. 1823 నుంచి అమెరికా ‘మన్రో సిద్ధాంతం’ అనే విధానాన్ని కలిగి ఉంది. ఏదైనా బయటి దేశం దక్షిణ అమెరికాలోకి ప్రవేశించి ఆధిపత్యం చెలాయిస్తే.. అమెరికా దానిని యుద్ధ చర్యగా చూస్తుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన్రో సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ మదురో దక్షిణ అమెరికాలో అమెరికన్ వ్యతిరేక శక్తులను సృష్టించారని, అందుకే ఆయనను పదవి నుంచి తొలగించి తమ అధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు మదురో మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నారని కూడా ట్రంప్ ఆరోపించారు.
చమురు నిల్వల దేశం
వెనెజువెలా అపారమైన చమురు నిల్వలకు ప్రసిద్ధి పొందింది. ప్రపంచవ్యాప్తంగా వెనిజువెలా 300 బిలియన్ బ్యారెళ్ల అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. ఈక్రమంలో చమురు నిల్వలు అధికంగా ఉన్న ఇతర దేశాలతో పోల్చితే ప్రధానంగా సౌదీ అరేబియాలో 267 బిలియన్ బ్యారెళ్లు, యునైటెడ్ స్టేట్స్‌లో 70 బిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. మన భారతదేశంలో నాలుగు బిలియన్ బ్యారెళ్లకు మాత్రమే పరిమితమైన చమురు నిల్వలు ఉన్నాయి.
భారతదేశం చమురు అవసరాలలో 85% కంటే ఎక్కువగా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. వెనెజువెలాలో జరిగే సంఘటనలపై భారతదేశపు ప్రయోజనాలు కూడా ప్రభావితం అవుతాయి. వెనెజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉన్నప్పటికీ.. ఆ దేశం యూరప్, అమెరికా నుంచి రాజకీయపరమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. దీంతో భారతదేశం కూడా వెనెజువెలా నుంచి చమురు కొనుగోలు చేయడం మానేసింది.
ఒకప్పుడు వెనెజువెలా రోజుకు 3 మిలియన్ బ్యారెళ్లను ఉత్పత్తి చేసేది. కానీ, నికోలస్ మదురో అధ్యక్షుడైన తర్వాత.. ఉత్పత్తి రోజుకు ఒక మిలియన్ బ్యారెళ్ల కంటే చాలా తక్కువకు పడిపోయింది. వెనెజువెలా చమురుపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేయడం వల్ల.. 2020 చివరిలో వెనెజువెలా నుంచి ముడి చమురు దిగుమతిని భారతదేశం నిలిపివేసింది.
భారతదేశం చమురు దిగుమతులు
భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు. భారతదేశం సగటున రోజుకు 6 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. వెనెజువెలా చమురు అందుబాటులో ఉన్నప్పుడు భారతదేశం రోజుకు 200,000 బ్యారెళ్ల వరకు చౌకధరకు చమురును దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో చమురు ఉత్పత్తి రోజుకు 105 మిలియన్ బ్యారెళ్ల వద్ద ఉంది. మదురో అధ్యక్షుడైన తర్వాత వెనెజువెలా తక్కువ స్థాయిలో చమురును ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అధిక ధరలను సృష్టించింది.
మదురో తొలగింపు వల్ల చైనాకు నష్టాలు
వెనెజువెలా అధ్యక్షుడు మదురో తొలగింపు వల్ల చైనా అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. వెనెజువెలాకు బిలియన్ డాలర్ల రుణాలను చైనా పెట్టుబడి పెట్టింది. భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. వెనెజువెలా కొత్త చమురు క్షేత్రాలలోనూ చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. నికోలస్ మదురో తొలగింపుతో ప్రస్తుతం చైనా భారీ నష్టాలను చవిచూస్తోంది. అంతేకాకుండా వెనెజువెలా నుంచి చైనా చవకగా పొందుతున్న చమురు ఆగిపోతుంది.
మదురోను అమెరికా దాడి నుంచి రక్షించలేకపోవడంతో చైనా అంతర్జాతీయ ఖ్యాతిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. చైనా ఇప్పుడు ఇతర దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాలలో కూడా మరింత సంకట స్థితిని ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఆ దేశాల్లో కూడా చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. మన పొరుగు దేశాలు చైనాకు అనుకూలంగా ఉంటే, ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
చైనాకు చౌకగా చమురు అందించే మరో ప్రధాన దేశం ఇరాన్. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం సమస్యలను ఎదుర్కొంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్వల్ల ఇరాన్ ప్రభుత్వానికి ఏదైనా జరిగితే చైనా కూడా చవకైన చమురు లభించే పెద్ద వనరును కోల్పోతుంది. మరే దేశం ఇరాన్ చమురును కొనుగోలు చేయదు. దీంతో ఇరాన్‌కు కష్టాలు తప్పవు.
చమురు ధరలు తగ్గితే..
రూపాయి విలువ పెరుగుతుంది. ప్రధాన ఇంధన దిగుమతిదారు అయిన భారతదేశం వెనెజువెలా నుంచి ముడి చమురును తిరిగి పొందడం ద్వారా లాభం పొందుతుంది. అయితే చైనా కారకాస్ అస్థిరత నుంచి వ్యూహాత్మక, ఆర్థికనష్టాలను ఎదుర్కొంటుంది. భారతదేశంలో చాలామంది అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి మరొక దేశంపై దాడి చేసిందని మాట్లాడుతున్నారు. అది నిజమే, కానీ ఒక విషయం ఏమిటంటే.. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నప్పుడు వెనెజువెలా, ఇరాన్, చైనా, ఇతర దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించలేదు. ఉక్రెయిన్ కూడా ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ఖండించలేదు.
ఎందుకంటే చైనా ఉక్రేనియన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. చమురు ధరలు తగ్గితే రూపాయి విలువ కూడా గణనీయంగా పెరుగుతుంది. భారతదేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గే అవకాశం ఉంది. భారతదేశానికి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడం ఓ అవసరం.
భారతదేశానికి లాభమేమిటి?
- వెనెజువెలా చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసి, ఎక్కువ చమురు ఉత్పత్తి చేసిన తర్వాత భారతదేశానికి చాలా తక్కువ ధరకు చమురు లభిస్తుంది.
- చవకైన ముడి చమురు దిగుమతులు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, వాణిజ్య లోటును తగ్గించడానికి సహకరిస్తాయి. దేశీయ ఇంధన ధరలను స్థిరీకరించడానికి సహాయపడతాయి. వెనెజువెలా చమురుకు పరిమిత డిమాండ్ కూడా ఇతర సరఫరాదారులతో భారతదేశం బేరసారాల స్థానాన్ని బలపరుస్తుంది. వెనెజువెలా చమురు ఉత్పత్తిని భారీగా పెంచడం ప్రారంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతాయి.
- భారతదేశం రోజుకు 60 లక్షల బ్యారెళ్లకు పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ధరలు బ్యారెల్‌కు ఒక డాలర్ తగ్గితే, భారత్ రోజుకు రూ. 54 కోట్లు విదేశీ మారకద్రవ్యం ఆదా చేస్తుంది. ఊహించినవిధంగా చమురు ధరలు 10 డాలర్లు తగ్గితే ఊహించుకోండి.
- వెనెజువెలాపై అమెరికా దాడి ప్రభావం భారతదేశానికి చమురు ధరల పరంగా ప్రయోజనం కలిగిస్తే, చైనాకు నష్టం కలిగిస్తుంది.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్
