రైతులు పంటమ్ముకున్నంక ఫుల్లు రేట్లు.. మిర్చి, కంది, పత్తికి భారీగా పెరిగిన ధరలు

రైతులు పంటమ్ముకున్నంక ఫుల్లు రేట్లు.. మిర్చి, కంది, పత్తికి భారీగా పెరిగిన ధరలు
  • మార్కెట్​లో వ్యాపారుల మాయాజాలం
  • అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు.. లాభపడుతున్న వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు: రైతుల చేతిలో పంట ఉన్నప్పడు ధరలు ఉండవు.. కానీ పంటల్లేని టైమ్​లో మాత్రం ధరలు ఫుల్లు పెరుగుతున్నయ్. దీంతో రైతుల వద్ద తక్కువ ధరకు పంటలు కొన్న వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది వ్యాపారుల  మార్కెట్​ మాయాజాలానికి అద్దంపడుతున్నది. పంట వేయకముందు ధరలు బాగానే ఉంటుండగా.. ఇది చూసి పంటలు సాగుచేసిన అన్నదాతకు నిరాశే ఎదురవుతోంది. రైతులు పంటలన్నీ అమ్ముకున్నంక ఇప్పుడు మిర్చి, పత్తి, కంది  ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు వారు అమ్ముకున్న రేటుకు డబుల్​ ధర పలుకుతున్నాయి. రైతుల వద్ద పంటకొని కోల్డ్​ స్టోరేజీలో దాచుకున్న వ్యాపారుల పంట పండుతోంది. రైతులకు కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా.. మరోవైపు  వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

మార్కెట్‌‌లో జోరుగా మిర్చి ధర 

మార్కెట్‌‌లో మిర్చి ధర దుమ్ము రేపుతోంది. శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటాల్​కు రూ.20వేల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే కోల్డ్​ స్టోరేజీల్లో నిల్వ చేసిన వారికి, వ్యాపారులకే లాభాలు తెచ్చిపెడుతున్నాయి.  అదే రైతు చేతిలో పంట ఉన్నప్పడు మాత్రం ధర ఉండడం లేదు. రైతులు తెచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్​ మిర్చి మార్కెట్​లో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే కొన్నరు.

ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గత వారం రోజులుగా గరిష్ట ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది. మోడల్​ ధరలు మాత్రం రూ.17,500, రూ.17వేలు, రూ.16,500, రూ.16వేలుగా  కొనసాగుతున్నాయి. ఖమ్మం మార్కెట్‌‌లో గతేడాది పండించిన పంటను వ్యాపారులు, కొందరు రైతులు కోల్డ్‌‌ స్టోరేజీల్లో నిల్వచేశారు. ఆ నిల్వలకు ఇప్పుడిప్పుడే ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పంటను ముంబై, కోల్‌‌కతా, ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.  

మిర్చి రైతుకు క్వింటాల్​కు సగటున రూ.9వేలే!

గత సీజన్​లో వివిధ కారణాల వల్ల మిర్చి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడు రైతు ఆశించిన ధర దక్కలేదు. సగటున క్వింటాల్​కు రూ.9 వేలు మాత్రమే దక్కింది. అయితే రైతులు పంట అమ్ముకున్న తర్వాత తాజాగా మిర్చికి  ఒక్కసారిగా అంతర్జాతీయంగా డిమాండ్‌‌ ఏర్పడింది. విదేశాలకు మిర్చి ఏపీ, తెలంగాణల నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం చైనా, థాయిలాండ్‌‌ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.  మేలు రకం తేజ క్వింటాల్​ ధర రూ.20వేలకు చేరింది. మిగిలిన మిర్చి రకాలు కూడా క్వింటాల్​కు రూ.16 వేలు పలుకుతున్నాయి.  తాలు మిర్చీ కూడా పది వేలకు పైగా ధర పలకడం గమనార్హం. 

11 వేలు దాటిన క్వింటాల్​ కంది ధర 

సీజన్​ ముగిసిన తర్వాత కందులకు మార్కెట్​లో మంచి ధర పలుకుతోంది. పంట రైతుల చేతిలో ఉన్నప్పుడు రూ.7 వేలు, రూ.7,500, రూ.8 వేలు, రూ.9 వేలు ధర పలికింది. సీజన్​ ముగియగా తాజాగా గత వారం రోజులుగా క్వింటాల్​ కంది ధర రూ.11 వేలకు చేరుకున్నది.  రాష్ట్రం నుంచి తమిళనాడు, కేరళ, రాష్ట్రాలకు కందిపప్పు రవాణా జరుగుతోంది. ఈ నేపథ్యంలో  పంటల ఉత్పత్తులు లేక పోవడంతో వ్యాపారులు పోటీ పడి కొంటున్నరు. రాష్ట్రంలో కంది సాగు చేసిన రైతులు ఇప్పటికే అమ్ముకోగా, చాలా వరకు వ్యాపారుల వద్ద కంది నిల్వలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభం నుంచే ధర రూ.11 వేలు దాటగా, వ్యాపారులు లాభపడుతున్నారు.

పల్లికి తగ్గిన డిమాండ్ 

ఓవైపు నూనెల ధరలు భగ్గుమంటుంటే పల్లి పంటకు ధరలు మాత్రం అనుకున్నంత డిమాండ్​లేదు.  ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లో ధర రూ.5,909 పలుకుతోంది. వేరుసెనగ పంట ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉందనీ, ఈ కారణంగానే ధర పెరగడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.  

పత్తి రైతు పరిస్థితి అంతే..

రైతు నుంచి పంట చేజారిన తర్వాత పత్తి ధరలు పెరిగాయి. ఇప్పుడు మార్కెట్లో క్వింటాలు పత్తి ధర గణనీయంగా పెరుగుతూ వస్తూ రూ.7,250కు చేరుకుంది. దీంతో అప్పటికే పంటను కొనుగోలు చేసిన ప్రైవేట్‌‌ ట్రేడర్సే లాభపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాజా పత్తికి మద్దతు ధరను రూ.501 పెంచింది. గతేడాది క్వింటాల్​కు రూ.6,620 ఉండగా, ఈ యేడాది తాజాగా పెంచిన ధరలతో  రూ.7,121 అయింది.  పత్తి రైతుల వద్ద ఉన్నప్పుడు గ్రామాల్లో కొనేవారి మధ్య పోటీ లేకపోవడంతో వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకున్నారు. సగటున రూ.4వేలకు క్వింటాల్​పత్తిని అప్పజెప్పారు. దీంతో ప్రతి క్వింటాల్​కు రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య రైతులు నష్టపోయారు.