హైదరాబాద్లో భక్తులకు అలర్ట్.. కార్తీక మాసంలో ఈ గుడికెళుతున్నారా..? అక్కడ మొసలి ఉంది జాగ్రత్త !

హైదరాబాద్లో భక్తులకు అలర్ట్.. కార్తీక మాసంలో ఈ గుడికెళుతున్నారా..? అక్కడ మొసలి ఉంది జాగ్రత్త !

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధులు గుట్ట సిద్దేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న వాగులో మొసలి సంచారం కలకలం రేపింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి వెళుతున్న భక్తుల్లో కొందరు వాగులో మొసలిని చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చేపలు పట్టేవారు అటువైపుగా వెళ్లొద్దని స్థానికులు సూచించారు. సోషల్ మీడియాలో మొసలి వాగులో సంచరిస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. 

కార్తీక మాసం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటారు. అక్కడి పురాతన శివలింగానికి అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసం అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వాములు.. తమ పనులు ముగించుకుని.. నిత్యం రాత్రి పగలు వెండి కొండ సిద్దేశ్వర స్వామి ఆలయంలోనే సన్నిధానం ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు.

ఈ కార్తీక మాసం నెల మొత్తం దేవాలయం దగ్గర దీపాలు వెలిగించేందుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇదే నెలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు దేవాలయం ముందున్న వాగులో మొసలి సంచరిస్తుండటంతో భక్తులు, అయ్యప్ప స్వాములు ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే అక్కడ మొసలి ఉన్నట్టు ఫారెస్ట్ అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు మొసలిని పట్టుకొని జూ పార్క్కు తరలించాలని భక్తులు కోరుతున్నారు.