కొండ అంచున ప్రపోజ్! జారి.. లోయలో పడ్డ యువతి

కొండ అంచున ప్రపోజ్!  జారి.. లోయలో పడ్డ యువతి
నేలమీద పేరుకున్న మంచు కాపాడింది ఆస్ట్రియా: మ్యారేజ్ ప్రపోజల్ డిఫరెంట్ గా ఉండాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం పాపం తన దోస్తు పాణాల మీదికి తెచ్చింది. కొండ శిఖరం మీద ప్రపోజ్ చేస్తుండగా కాలు జారి ఆ యువతి లోయలో పడిపోయింది. అదృష్టవశాత్తూ కింద భారీగా మంచు పేరుకుపోవడంతో దెబ్బలతో బయటపడింది. ఆస్ట్రియా దేశంలోని కారింతియలో డిసెంబర్ 27 నాడు జరిగిన ఈ ఘటన వివరాలు.. కారింతియాకు చెందిన ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ కు డిఫరెంట్ గా ప్రపోజ్ చేయాలని భావించాడు. తనుండేది కొండ ప్రాంతం కావడంతో దగ్గర్లోని ఫాల్కెర్ట్ పర్వతాన్ని ఎంచుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని కష్టపడి గుట్టపైకి ఎక్కిండు. ఓ మంచి ప్లేస్ చూసుకుని ప్రపోజ్ చేయడానికి రెడీ అయిండు. ఈ ప్రయత్నంలో తన గర్ల్ ఫ్రెండ్ కాలు జారి, కింద లోయలో పడింది. దాదాపు 650 అడుగుల పైనుంచి కింద పడిపోయింది. కింద భారీగా మంచు పేరుకుని ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, తీవ్ర గాయాలతో ఆమె స్పృహ తప్పింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఆ యువకుడు కూడా లోయలోకి జారిండు. 50 అడుగులు జారినంక ఓ చెట్టును అందుకుని ఆగిండు. ట్రెక్కింగ్ కోసం వచ్చిన వాళ్లు వీళ్లను గమనించి సమాచారం ఇవ్వడంతో లోకల్ అధికారులు వచ్చి కాపాడారు. ఇద్దరికిద్దరూ చాలా అదృష్టవంతులని, అక్కడ మంచు లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.