కొని పెట్టుకోండి : ఉల్లి ధరలు కూడా పెరగబోతున్నాయా?

కొని పెట్టుకోండి : ఉల్లి ధరలు కూడా పెరగబోతున్నాయా?


కన్నీళ్లు తెప్పించే ఉల్లినే కూల్ గా ఉంటే.. టమాటా ఏంటబ్బా మండిపోతుంది అనుకుంటున్నారు.. ఇప్పటి వరకు మీరు ఇలాగే అనుకుని ఉంటారు.. మరో వారం రోజులు కూడా ఇలాగే అనుకుంటూ ఉండొచ్చు.. జూలై నెలలో మాత్రం మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు ఉల్లి. ఎందుకంటారా.. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ఇది వ్యాపారులు చెబుతున్న మాట కాదు.. కేంద్ర ప్రభుత్వం వర్గాలు చేస్తున్న అంచనా. ఈ మాత్రం హింట్ ఇస్తే.. ఉల్లి వ్యాపారులు రెచ్చిపోరా అంటే.. వాళ్లను కూడా కంట్రోల్ చేసే మార్గం ఉందని కేంద్రం చెబుతున్నా.. హోల్ సేల్ వ్యాపారులు మాత్రం.. రాబోయే నెల రోజుల్లో ఉల్లి ధరలు కూడా సెంచరీ కొట్టటం ఖాయం అంటున్నారు. దీనికి కారణం వర్షాల వల్ల ఉల్లి సాగు దెబ్బతినటమే కాకుండా.. ప్రస్తుతం ఉన్న ఉల్లి నిల్వలులు వేగంగా తగ్గిపోవటమే. 

ఉల్లిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఒకటి.  మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా సాగు చేస్తారు. 2021–-22లో ఉల్లి ఉత్పత్తి 31.69 మిలియన్ టన్నులుగా అంచనా వేస్తే.. సవరించిన అంచనాలతో ఉల్లిపాయల ఉత్పత్తి  31 మిలియన్ టన్నులుగా చెబుతున్నారు అధికారులు. ఇది వాస్తవ అంచనా అయినా.. కొన్ని ప్రాంతాల్లో అధిక ఎండల వల్ల.. మరి కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ఉల్లి ఉత్పత్తి ఇంకా తక్కువగా ఉంటుందని రైతులు, లోకల్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. 2022–-23లో 2.51 లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేసింది కేంద్ర ప్రభుత్వం. 2023–-24 సీజన్‌లో మాత్రం 3 లక్షల టన్నుల ఉల్లిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. 

కేంద్ర ప్రభుత్వ అంచనాలు ఎలా ఉన్నా.. రాబోయే జులై నెలాఖరుకు మాత్రం ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో.. వంద రూపాయలకు ఆరు కిలోల ఉల్లి ఇస్తున్నారు. కొన్ని చోట్ల వంద రూపాయలకు పది కిలోలు కూడా ఇస్తున్నారు. ఇదంతా పాత స్టాక్.. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పాత ఉల్లి వినియోగం అంతా నెల రోజులకే సరిపోతుందని.. కొత్త ఉల్లి మార్కెట్ లోకి వచ్చే సమయానికి డిమాండ్ – సప్లయ్ మధ్య తేడా వస్తుందని.. కచ్చితంగా ఉల్లి ధరలు కూడా పెరుగుతాయనే అంచనా వేస్తున్నారు వ్యాపారులు. 

గత సంవత్సరం అంటే.. 2022 జూన్ నెలతో పోల్చితే.. ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లి ధరలు తక్కువగానే ఉన్నాయి. మిగతా కూరగాయలతో పోల్చినా.. ఉల్లి కన్నీళ్లు తెప్పించకపోవటం కొద్దిలో కొద్దిగా ఆనందం.. ఇక ఉల్లి కూడా ధరల్లో ఏడిపించటం మొదలుపెడితే.. సామాన్యుడు కంటి కన్నీరు ఖాయం..