
ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కని సంగతి తెలిసిందే. అక్టోబర్ 19 నుంచి జరగనున్న ఈ మెగా సిరీస్ కు భారత స్క్వాడ్ ను శనివారం (అక్టోబర్ 4) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మందితో కూడిన స్క్వాడ్ లో జడేజాను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట జడేజాకు రెస్ట్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సీనియర్ ఆల్ రౌండర్ ని తప్పించామని అగార్కర్ చెప్పాడు. జడేజాను ఎందుకు పక్కన పెట్టారో అజిత్ అగార్కర్ కారణం వింటే షాక్ అవ్వక తప్పదు.
జడేజాను ఎందుకు తప్పించారు అనే ప్రశ్నకు అగార్కర్ ఈ విధంగా సమాధామనమిచ్చాడు.. " జడేజా మా ప్రణాళికల్లో ఉన్నాడు. అతని స్థానంపై పోటీ నెలకొంది. జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కువ మంది స్పిన్నర్లను తీసుకున్నాం. కుల్దీప్ కూడా ఉండడంతో మాకు బ్యాలన్స్ అయింది. అయితే ఆస్ట్రేలియాలో అంత అవసరం ఉండదు. అక్కడ ఎక్కువ మంది స్పిన్నర్లతో వెళ్లలేం. ఇద్దరు లెఫ్టర్మ్ స్పిన్నర్లు జట్టులో అవసరం లేదని భావించాం. ఆల్ రౌండర్ గా జడేజా ఎలాంటి ఆటగాడో మనకు తెలుసు. అతను మా దీర్ఘ కాళిక ప్రణాళికల్లో ఉన్నాడు. పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం". అని అగార్కర్ అన్నాడు.
ప్రస్తుతం జడేజా సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా సిరీస్ లో చోటు దక్కలేదు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపైనా జడేజా లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఎంతైనా ఉంది. జడేజాను కాదని సుందర్, అక్షర్ కు ఛాన్స్ దక్కింది. చూస్తుంటే జడేజాను సైలెంట్ గా పక్కకు తప్పించి యంగ్ ప్లేయర్స్ సుందర్, అక్షర్ లకు వరల్డ్ కప్ సమయానికి ఎక్కువ ఛాన్స్ లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక జడేజా టెస్టులకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది.