- పంచాయతీ ఎన్నికల్లోకి ఏజెన్సీలు
- ప్రజల మూడ్ నుంచి ప్రచారం దాకా
- అన్నీ చూసుకుంటామని ప్రకటనలు
- సర్పంచ్ ఆశావహులకు ఆఫర్లు
- పెద్ద పంచాయతీలపై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: ‘మీరు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారా? ప్రచారం ఎలా చేయాలో.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. ఏం మాట్లాడాలో చెప్తాం.. సర్వే చేసి గెలుపు అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో, ఎలా పెంచుకోవాలో వివరిస్తాం.. పాంప్లెట్ల తయారీ నుంచి సోషల్ మీడియా రీల్స్ దాకా మేమే చూసుకుంటాం.. మీ విజయానికి మాదీ పూచీ..’ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న ఇలాంటి మెసేజ్‌లు చూసి జనం అవాక్కవుతున్నారు. ఇన్నాళ్లూ పెద్దపెద్ద పార్టీలకు పనిచేసిన ఎన్నికల వ్యూహకర్తలు, ఏజెన్సీలు ఇప్పుడు పంచాయతీల స్థాయిలోనూ విస్తరించిన తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. సాధారణంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలకు గెలుపు వ్యూహాలు ఇచ్చేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్టులు, వివిధ ఏజెన్సీలు పనిచేయడం చూస్తుంటాం. జాతీయ స్థాయిలో ప్రశాంత్‌కిశోర్, సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజిస్టుల ప్రభావం తెలిసిందే.
ఈక్రమంలోనే తాజాగా లోకల్‌బాడీ ఎన్నికలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న స్ట్రాటజిస్టులు, ఏజెన్సీలు రంగంలోకి దిగుతున్నాయి. రాబోయే జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల లక్ష్యంగా పుట్టుకొచ్చిన ఈ ఏజెన్సీలు.. పంచాయతీ ఎన్నికలపైనా ఫోకస్పెట్టాయి. ప్రధానంగా కార్పొ రేషన్లు, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల చుట్టు పక్కల, నేషనల్, స్టేట్హైవేస్ వెంట రియల్ఎస్టేట్, వ్యాపారలావాదేవీలు ఎక్కువగా సాగే గ్రామాలు, మేజర్ పంచాయతీల్లో సర్పంచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆయా పంచాయతీల్లో సర్పంచులుగా పనిచేసేవారికి పైసా, పరపతికి ఢోకా ఉండదు. రాజకీయంగానూ మంచి పొజిషన్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో ఎలాగైనా గెలవాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు.
జనరల్ స్థానాల్లో రూ. కోటిపైనే
జనరల్ స్థానాల్లో సర్పంచ్ పదవి కోసం రూ.కోటి నుంచి రూ.2 కోట్లు పెట్టే అవకాశముంది. సరిగ్గా ఇలాంటి వారినే ఏజెన్సీలు టార్గెట్ చేశాయి. సర్వే దగ్గర నుంచి ప్రచారం దాకా అన్ని వ్యహారాలు తాము చూసుకుంటామని, గెలుపు బాధ్యత తమదేనని భరోసా ఇస్తున్నాయి. ఇందుకోసం రూ.10 లక్షలు ఆపైన డిమాండ్‌చేస్తున్నట్లు తెలిసింది. కాగా, ఇలాంటి ఏజెన్సీలతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి అడుగేయాలని పోలీసులు, అధికారులు చెప్తున్నారు. వారికి ఎలాంటి పర్మిషన్లు ఉండనందున డబ్బులు తీసుకొని ఉడాయించే అవకాశం ఉంటుందని, అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
