సమాచారం లేకుండా రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ ప్రకటన చెల్లదు

సమాచారం లేకుండా  రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌ ప్రకటన చెల్లదు
  • పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలును నిలిపివేయండి
  • హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌.. నేడు విచారణకు వచ్చే అవకాశం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారో చెప్పకుండా జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ బుధవారం హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలైంది. జనాభా గణంకాలను వెల్లడించకుండా రిజర్వేషన్లను కేటాయిస్తూ ఈ నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాలు చేస్తూ వికారాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం తరఫున ఎస్‌‌‌‌‌‌‌‌.లక్ష్మి మరో ఆరుగురు ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 

రిజర్వేషన్లను కేటాయించడానికి దారి తీసిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన కేటాయించారన్న దానికి ఎక్కడా వివరణ లేదన్నారు. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక కమిషన్‌‌‌‌‌‌‌‌ సమర్పించిన వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరణ కూడా చేపట్టకపోవడం వల్ల కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు తగ్గి అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. 

అందువల్ల రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తదితరులను పేర్కొన్నారు. దీనిపై చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అపరేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జీఎం మొహియుద్దీన్​తో కూడి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ..

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లను కేటాయిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ అమలుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీల రిజర్వేషన్ల ఖరారు చేస్తూ ఈ నెల 23న జారీ చేసిన గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను సవాలు చేస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోల్‌‌‌‌‌‌‌‌ మండలం కొరబోయిన ఆగమయ్య బుధవారం అత్యవసరంగా లంచ్‌‌‌‌‌‌‌‌ మోషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 

దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టగా, పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది మామిండ్ల మహేశ్‌‌‌‌‌‌‌‌ వాదనలు వినిపించారు. సంగారెడ్డిలో 613 సర్పంచ్‌‌‌‌‌‌‌‌లకుగాను 118 మాత్రమే బీసీలకు కేటాయించారన్నారు. ఇది 19 శాతం మాత్రమేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం బీసీలకు 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి కూడా బీసీలకు రిజర్వు చేయలేదన్నారు.

 ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధమని పేర్కొన్నారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌ జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌పై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనకు న్యాయమూర్తి నిరాకరించారు. అనంతరం ప్రతివాదులైన పురపాలక శాఖ, పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు నోటీసులిస్తూ విచారణను డిసెంబర్ 10కి వాయిదా వేశారు.