ఎస్టీ, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి : అద్దంకి దయాకర్

 ఎస్టీ, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి : అద్దంకి దయాకర్
  • ఢిల్లీలో మాలమహానాడు సభలో అద్దంకి దయాకర్ 

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో మాదిరిగానే కోర్టుల్లోనూ రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలన్నారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ హక్కుల సాధన సభ’ జరిగింది. 

ఈ సభలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ స్ఫూర్తితో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రాజ్యంగ పరిరక్షణకు నడుం బిగించాలన్నారు.  ఈ అంశంపై త్వరలోనే చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. రోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతుందని, ఈ విషయంపై సీఎంని కలిసి చర్చించినట్లు చెప్పారు. 

మాలల హక్కుల సాధన కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళతామన్నారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు తెలంగాణ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ , మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి భైరి రమేశ్, నేతలు కొండబాబు, బత్తుల లింగం పాల్గొన్నారు.