ఖమ్మం టౌన్, వెలుగు : సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులపై వచ్చిన అప్పిళ్లను ఆయన పరిశీలించారు.
అనంతరం కలెక్టరేట్ లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేండ్లుగా ఆర్టీఐ కమిషనర్ నియామకం కాకపోవడంతో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీఐ చట్టంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించామన్నారు.
అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆర్టీఐ చట్టం ప్రకారం అవగాహనతో అమలు చేస్తే అక్రమాలు తగ్గిపోతాయన్నారు. అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి శాఖ తమకు వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తులను సకాలంలో డిస్పోజ్ చేయాలన్నారు.
ప్రతి అధికారి తమ శాఖ పరిధిలో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల వివరాలతో కూడిన రిజిస్టర్ మెయింటైన్ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ ఎంఏ రాజు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
