
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియాకు (వీఐకి) అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) బకాయిలపై అదనపు మినహాయింపు ఇవ్వాలా వద్దా ? అనే అంశంపై కేంద్ర కేబినెట్, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), ఆర్థిక మంత్రిత్వ శాఖ, టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డాట్ కలిసి నిర్ణయం తీసుకుంటాయని కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. “ఇప్పటికే వారి అప్పులను ఈక్విటీలోకి మార్చాం. ప్రస్తుతం మేము కొత్తగా ఏ చర్చలు జరపడం లేదు” అని మంత్రి పేర్కొన్నారు.
వీఐ ఏజీఆర్ బకాయిలు రూ.83,400 కోట్లుగా ఉండగా, మార్చి 2026 నుంచి ఏడాదికి రూ.18 వేల కోట్లు చెల్లించాలి. స్పెక్ట్రమ్ ఫీజులు, ఇతర బకాయిలు కలుపుకుంటే మొత్తం ప్రభుత్వానికి రూ. 2 లక్షల కోట్లను కంపెనీ చెల్లించాలి. రెండు సంవత్సరాల మారటోరియం, ఏడాదికి తక్కువ చెల్లించడం, వడ్డీ మినహాయింపు వంటి పలు రిలీఫ్ ఆప్షన్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ (డాట్) పీఎంఓకి ప్రతిపాదించినట్లు సమాచారం.
వీఐ ఇప్పటికే రూ.53,083 కోట్ల బకాయిని ఈక్విటీగా మార్చి, ప్రభుత్వానికి 49శాతం వాటా ఇచ్చింది. అయినప్పటికీ, సంస్థ తీవ్ర లిక్విడిటీ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకులు ఏజీఆర్ బకాయిలపై స్పష్టత లేకుండా రుణాలు ఇవ్వడాన్ని నిరాకరిస్తున్నాయని వీఐ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న డాట్‌కి పంపిన లేఖలో రూ.17,213 కోట్ల ప్రిన్సిపల్‌ను తుది మొత్తంగా పరిగణించి, వడ్డీ, జరిమానాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరింది.
“ప్రభుత్వం ఇప్పుడు ప్రధాన షేర్‌హోల్డర్. ఏజీఆర్ సమస్యపై పరిష్కారం వస్తుందని మేము నమ్ముతున్నాం” అని కంపెనీ మాజీ సీఈఓ అక్షయ్ ముంద్రా అన్నారు. వీఐకి 19.80 కోట్ల వినియోగదారులు, 18 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది జూన్ చివరినాటికి బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1,944.5 కోట్లుగా ఉన్నాయి. వీఐ ప్రస్తుతం నాన్-బ్యాంక్ ఫైనాన్సింగ్ ద్వారా రుణాలను తీసుకోవాలని కూడా చూస్తోంది.