పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్నారు మహాత్మా గాంధీ. ఎందుకంటే.. ఆ పల్లెలు వ్యవసాయం చేస్తేనే పట్టణాలు బతుకుతున్నాయి. మనుషుల మనుగడ సాగుతోంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఒకప్పుడు దేశ జీడీపీలో వ్యవసాయానిదే సగం వాటా ఉండేది. అయితే.. ఇప్పుడు వాటా తగ్గినా.. వ్యవసాయ ఉత్పత్తి మాత్రం బాగానే పెరిగింది. ఈ 75 ఏండ్లలో ఆహార లోటు స్థాయి నుంచి ఆహార మిగులు స్థాయికి ఎదిగింది ఇండియా. కానీ.. రైతు మాత్రం పెద్దగా ఎదగలేకపోతున్నాడు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒక సందర్భంలో వ్యవసాయమే దేశం కన్నీళ్లను తుడిచింది. ఎంతోమందికి ఉపాధిని ఇచ్చింది. అంతెందుకు ఇన్నేండ్ల ప్రయాణంలో ఉపాధి కల్పించడంలో వ్యవసాయ రంగమే ముందుంది. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించడంలోనూ వ్యవసాయ రంగానిది ‘కీ’ రోల్. కానీ.. వ్యవసాయం చేసేవాడు మాత్రం ఇప్పటికీ పేదవాడిగానే ఉన్నాడు. దానికి కారణం.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ రంగం ఎన్నో సార్లు హెచ్చు తగ్గులను చూడాల్సి వచ్చింది. మనకు వ్యవసాయం కొత్తేమీ కాదు. సింధు లోయ నాగరికత కాలం నుంచే మన దేశంలో వ్యవసాయం చేస్తున్నారు. కానీ.. పెరుగుతున్న జనాభా, మిగులు కార్మికులు, కాలం చెల్లిన సాంకేతికత, కేవలం వర్షాలపైనే ఎక్కువగా ఆధారపడటం లాంటి వాటి వల్ల నష్టాలు వచ్చేవి. 1960ల్లో దేశంలోని ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయమే చేస్తున్నా.. ఆహార ధాన్యాల మిగులు మాత్రం చాలా తక్కువ. దాంతో మన నాయకులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి, చివరికి వ్యవసాయాన్ని నిలబెట్టారు. దాంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడమే కాకుండా చెరకు, పత్తి, నూనె గింజలు, జనపనార లాంటి ఇతర పంటల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. అయితే.. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగినప్పటికీ జీడీపీలో వాటా మాత్రం ఎప్పుడూ తగ్గుతూనే వస్తోంది. దీనికి కారణం దేశంలో ఇండస్ట్రియల్, సర్వీస్ రంగాలు వ్యవసాయ రంగం కంటే స్పీడ్‌గా డెవలప్ కావడమే. వాటికి ఇచ్చినంత తోడ్పాటు వ్యవసాయానికి ఇవ్వకపోవడమే.
హరిత విప్లవం
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడానికి చేసిన ప్రయత్నమే హరిత విప్లవం. ఇది వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సాగు పద్ధతులను పూర్తిగా మార్చేసింది. 1961లో మనదేశంలో పంటల దిగుబడి తగ్గి కరువు వచ్చింది. దాంతో మెక్సికో నుంచి గోధుమలను దిగుమతి చేసుకుని పంజాబ్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా పండించారు. ఈ పంటతోనే మన దేశంలో హరిత విప్లవానికి వెల్‌కమ్ చెప్పినట్టయింది. ఆ తర్వాత అన్ని రకాల పంటల్లో దిగుబడి పెంచేందుకు కొత్త వంగడాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టైంలో టెక్నాలజీ కూడా కాస్త పెరిగింది. అది కూడా దిగుబడి పెరడానికి కారణమైంది.
ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్
మన దేశంలో 1990ల నుంచి ప్రైవేటైజేషన్ మొదలైంది. అప్పటినుంచి వ్యవసాయ రంగ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. వ్యవసాయంలో ప్రభుత్వరంగ పెట్టుబడి తగ్గింపు, సస్టెయినబుల్ అగ్రికల్చర్ సిస్టమ్‌ని డెవలప్ చేయలేకపోవడం, ధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం.. లాంటి అనేక కారణాలు వ్యవసాయ రంగంలో నష్టాలకు కారణమయ్యాయి. ప్రైవేటైజేషన్‌తో పాటు భూముల్లో మునుపటిలా సారం లేక దిగుబడి తగ్గడం, మార్కెట్ ఫెయిల్యూర్స్, అప్పులు, చీడపీడల బెడద, కనీస మద్దతు ధర లేకపోవడం లాంటి ఎన్నో సమస్యలు రైతుల మెడలకు ఉరితాళ్లుగా మారుతున్నాయి.
ఉత్పత్తి పెరిగినా..
కొన్నేండ్ల నుంచి మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు బాగానే పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరిని పండించే దేశాల్లో మనది 2వ స్థానంలో ఉంది. అయినా.. దానిమీద ఆధారపడిన వాళ్లందరికీ సరిపడా ఉపాధిని ఇవ్వలేకపోతుంది. దీనికి కారణం.. ఇతర దేశాలతో పోలిస్తే వ్యవసాయంపై ఎక్కువమంది ఆధారపడటం. కానీ.. దిగుబడి మాత్రం ఇతర దేశాలకంటే చాలా తక్కువగా ఉంటోంది. పంటల ఉత్పత్తి పెరిగినా దిగుబడి రేటు మాత్రం తక్కువగానే ఉంది. అమెరికా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశం మనదే. కానీ.. దిగుబడిలో మాత్రం ఆ దేశం కన్నా నాలుగు రెట్లు వెనకబడి ఉన్నాం. మన దేశంతో పోలిస్తే చైనాలో వ్యవసాయ భూమి తక్కువే. కానీ.. ఆ దేశ వ్యవసాయోత్పత్తి మనకన్నా మూడింతలు ఎక్కువ. దానికి కారణం మన సాగు పద్ధతులే.
