రైతులకు చట్టాలపై అవగాహనకు.. అగ్రి లీగల్‌ క్లినిక్‌లు జస్టిస్‌ నవీన్‌రావు

రైతులకు చట్టాలపై అవగాహనకు.. అగ్రి లీగల్‌ క్లినిక్‌లు జస్టిస్‌ నవీన్‌రావు

హైదరాబాద్, వెలుగు: సాగు చట్టాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను ప్రారంభించినట్లు తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్, హైకోర్టు జడ్జి జస్టిస్‌ పి.నవీన్‌ రావు తెలిపారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, నల్సార్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న పారా వలంటీర్ల రెండ్రోజుల  శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నల్సార్‌ వర్సిటీలో జస్టిస్​నవీన్ ​రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీరు, విత్తనాలు, లోన్లు, క్రిమిసంహారక మందులు, పంట మార్కెటింగ్,  భూమిపై    హక్కులు, లీజులు, కౌలుదారీకి సంబంధించిన వాటితో పాటు రైతులు ఎదుర్కొనే ఇతర సమస్యలకు చట్టాల ద్వారా పరిష్కార మార్గాలను వివరించడమే అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ల ప్రధాన లక్ష్యమన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 67 అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు ఉన్నాయని, 178 మంది పారా లీగల్‌ వలంటీర్లుగా నియమితులయ్యారని తెలియజేశారు. రైతుల వద్దకు ఈ వలంటీర్లు వెళ్లి చట్టాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. నల్సార్‌ వీసీ శ్రీకృష్ణదేవరావు తదితరులు పాల్గొన్నారు.