
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ, ఆరోగ్య సంరక్షణ కంపెనీ బేయర్ భారతీయ రైతుల కోసం 'కామాలస్' అనే క్రిమిసంహారక మందును విడుదల చేసింది. ఇది ఆకు, కాయ తొలిచే, రసం పీల్చే కీటకాలను సమర్థవంతంగా నివారిస్తుందని ప్రకటించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మార్కెట్లలో ఇది అందుబాటులో ఉంది.
కీటకాలు మొక్కలను తినకుండా కామాలస్ నివారిస్తుందని, మొక్కలను లోపలి నుంచి, వేర్ల ద్వారా రక్షిస్తుందని బేయర్తెలిపింది. ఈ పురుగుమందు పంటకు ఎక్కువ కాలం రక్షణ అందిస్తుందని, పదేపదే స్ప్రే చేయాల్సిన అవసరం తగ్గుతుందని వెల్లడించింది. ఇది టమోటా, వంకాయ, మిరపకాయ, క్యాబేజీ, బెండకాయ లాంటి పంటలకు బాగా ఉపయోగపడుతుందని తెలిపింది. ఇది 150 ఎంఎల్, 300 ఎంఎల్ సీసాల్లో దొరుకుతుందని కంపెనీ ప్రకటించింది.