33 పాయింట్లతో పంట నష్టంపై సర్వే

33 పాయింట్లతో పంట నష్టంపై సర్వే

క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న ఏఈవోలు 
ఇయ్యాల జిల్లా కలెక్టర్లకు నివేదిక

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో ఇటీవలి అకాల వర్షాలకు జరిగిన పంట నష్టంపై 33 రకాల వివరాలను సేకరిస్తూ అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో)లు క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తున్నారు. 33 అంశాలతో ప్రత్యేక ఎక్సెల్‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌లో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నారు. రైతు పేరు, తండ్రి పేరు, సోషల్‌‌‌‌‌‌‌‌ స్టేటస్‌‌‌‌‌‌‌‌, గ్రామం, మండలం, వేసిన పంట, జరిగిన పంట నష్టం, సర్వే నంబరు, 33 శాతం పం ట నష్టం జరిగిందా? అంతకంటే ఎక్కువా? అనే వివ రాలను నమోదు చేస్తున్నారు. అలాగే నీటి వసతి ఉందా? వర్షాధారమా? బ్యాంకు ఎకౌంట్‌‌‌‌‌‌‌‌ నంబరు, బ్యాంకు, బ్రాంచ్‌‌‌‌‌‌‌‌, ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ కోడ్‌‌‌‌‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌ నంబరు, భూమి ఉన్న రైతా? కౌలు రైతా? ఇలా అన్ని వివరాలను ఎఈవోలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఏఈవోలు చేపట్టిన సర్వే నివేదికలను సోమవారం సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందించనున్నారు. ఈ వివరాల ఆధారంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి వారి బ్యాంకు ఖాతాలో పంట నష్ట పరిహారాన్ని జమ చేయనున్నారు. జిల్లాల వారిగా సమగ్ర నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో పంట నష్టంపై సమగ్ర నివేదికతో నిధులు విడుదల చేయనున్నారు.   

నాలుగేండ్లుగా పట్టించుకోని సర్కార్    

రాష్ట్రంలో అకాల వర్షాలతోపాటు భారీ వర్షాలకు 2020 నుంచి ఏటా10 లక్షల నుంచి 15 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరుగుతోంది. కానీ గడిచిన నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా యోజన నుంచి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండానే రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చింది. అప్పటినుంచి ఏటా పంట నష్టం జరిగినా రైతులను పట్టించుకోలేదు. 2020లో14 లక్షల ఎకరాలు, 2021లో12 లక్షల ఎకరాలు, 2022లో 10 లక్షల ఎకరాలకుపైగా పంట నష్టం జరగగా..  ఈ నెలలో కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇందులో అధికంగా మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఇలా ఏటా చెడగొట్టు వానలకు, ప్రకృతి విపత్తులకు రైతులు నష్టపోతున్నారు. ఇన్నేండ్లు పట్టించుకోని సర్కార్ ఇప్పుడు ఇప్పటికైనా రూ. 10 వేల పరిహారం ప్రకటించిందని, కానీ ఆ సాయం ఏమూలకూ సరిపోదని రైతులు అంటున్నారు. అయితే, ఇన్నాళ్లూ కౌలు రైతులను రైతులుగానే గుర్తించని ప్రభుత్వం ఇప్పుడు వారికి కూడా పరిహారం ఇస్తామని చెప్పడం ఎన్నికల స్టంటేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.