
పెద్దపల్లి, వెలుగు: తెగుళ్లను తట్టుకునేలా కొత్త వరి విత్తనాలు తయారు చేస్తూ వ్యవసాయానికి దిక్సూచిగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం నిలుస్తోంది. ఇప్పటికే కునారం కేంద్రం ద్వారా 1010, దానికి ప్రత్యామ్నాయంగా కునారం సన్నాలు, కేఎన్ఎం 118లను రైతులకు అందజేసి దిగుబడుల్లో కొత్త చరిత్ర సృష్టించారు. అలాగే కేఎన్ఎం 733 తీసుకువచ్చి రైతు ఇంట బంగారం కురిపించారు. అలాగే నూతన పరిశోధనలతో కేఎన్ఎం1638 అనే మరో కొత్త వంగడం 2021లో విడుదల చేశారు. కేఎన్ఎం సీడ్స్ఏటా 25 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. మొదటి సంవత్సరంలోనే 1638 దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగయింది. రానున్న రెండు సంవత్సరాల్లో 1638 దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తుందని సైంటిస్ట్‌లు చెప్తున్నారు.
జయశంకర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో..
2007 సంవత్సరంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కునారం గ్రామ శివారులో ఆచార్య జయశంకర్అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరితోపాటు ఆగ్రో ఫారెస్ట్‌పై పరిశోధనలు చేసి వాటి ద్వారా కొత్త వంగడాలను రైతులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. అయితే 50 ఎకరాల్లో మాత్రం సాగు చేస్తూ రకరకాల విత్తనాలపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం కేఎన్ఎం 118, కేఎన్ఎం 1638 సీడ్స్ దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. కేఎన్ఎం సీడ్స్ తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లోని రైతులు ఉపయోగిస్తున్నారు. బీపీటీ 5204 కు బదులుగా కేఎన్ఎం 733 రకాన్ని కునారం పరిశోధనా కేంద్రంలో కనుగొన్నారు. ఈ రకం వంగడం రైతుకు అధిక దిగుబడులు తెచ్చిపెడుతున్నది. కేఎన్ఎం 733కు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఇది ప్రస్తుతం కునారం రైస్ 1 పేరుతో రైతులకు అందుబాటులో ఉంది. ఇది బీపీటీ కంటే నెల రోజుల ముందే అంటే 120 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ఈ రకం వానాకాలం, యాసంగి పంటలకు అనువైంది. అయితే ఈ రకం వానాకాలంలో జూన్ 20 నుంచి జులై 20 దాకా, యాసంగిలో అయితే నవంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు నారు పోసేందుకు అనుకూలంగా ఉంటుంది. పంటకాలం 125 నుంచి 130 రోజులు కలిగిన ఈ సన్న గింజ రకం అగ్గి తెగులును తట్టుకుని నిలబడుతుంది.
మంచి ఫలితాలిస్తున్న 118, 1638..
శాస్త్రవేత్తల పరిశోధనలో ఎంటీయూ 1010కు ప్రత్యామ్నాయంగా కేఎన్ఎం 118 వచ్చింది. ఈ రకాన్ని కునారం సన్నాలు అని కూడా పిలుస్తున్నారు. ఈ విత్తనాల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ విత్తనానికి గతంలోనే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రైతులు ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న 1010 వరి రకంతో చాలా సమస్యలున్నా గత్యంతరం లేక రైతులు అదే రకం వాడేవారు. దీంతో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి చీడపీడలను తట్టుకునే శక్తి ఉన్న కేఎన్ఎం 118 రకం తయారు చేశారు. దీని పంట కాలం 120 రోజులు, వానాకాలం అయితే 130 రోజులు పడుతుంది. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు కేఎన్ఎం 1638 అనే నూతన వంగడాన్ని తయారు చేశారు. 130 రోజుల పంటకాలం కలిగిన ఈ రకం వంగడం అన్ని పరీక్షలు పూర్తయి 2021లో రైతులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రైతులకే అందిస్తున్న ఈ వంగడం మరో రెండేళ్లలో దేశ వ్యాప్తం కానున్నది. ఇది గింజ రాలిపోయే రకం కాదు. చాలావరకు ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టుకునే శక్తి ఈ రకానికి ఉంటుంది. నేలల సారాన్ని బట్టి ఎకరాకు 30 నుంచి 34 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అన్నం చాలా రుచి కలిగి ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు
రైతులు ప్రతి సంవత్సరం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందడానికి కునారం పరిశోధన కేంద్రంలో తయారు చేస్తున్న విత్తనాలు ఉపయోగపడుతున్నాయి. రైతులకు అందుబాటులో ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాం. గతంలో ఆవిష్కరించిన సీడ్స్ ఆధారంగా రైతులు మంచి ఫలితాలు పొందారు. అలాగే 2021 చివర్లో మేలైన వంగడం కేఎన్ఎం 1638 తయారు చేసి విడుదల చేశాం. మంచి ఫలితాలు ఇచ్చింది. ఇప్పడు రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంది. సాగుకు అవసరమైన పెట్టుబడి ఖర్చు పెరుగుతున్న క్రమంలో, రైతులే మేలు వరి రకాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి కావాల్సిన మెలకువలను వివరిస్తున్నాం. అలాగే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. – డాక్టర్ సిద్ది శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్త