ఎవుసం బాగు చేసేందుకు.. 16పాయింట్ల ఫార్ములా

ఎవుసం బాగు చేసేందుకు..  16పాయింట్ల ఫార్ములా

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 16 యాక్షన్ పాయింట్లను ప్రకటించారు. రైతుల రాబడి పెంచడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, ఆక్వా రంగానికి ప్రోత్సాహం, పశుసంవర్ధక శాఖ అభివృద్ధి వంటి వాటి గురించి ప్రస్తావించారు. వాటర్ క్రైసిస్ ఎదుర్కొంటున్న రైతులకు పరిష్కారాన్ని చూపడంతోపాటు మెరైన్ ఫిషరీ రీసోర్సెస్‌‌ను మెరుగుపరిచేందుకు ప్లాన్స్ రూపొందిస్తామని ప్రకటించారు.


తక్కువ
నీరు, తగిన ఎరువు

పంటకు తగిన ఎరువు, తక్కువ నీరు, అవసరానికి తగినట్టుగా ఫర్టిలైజర్ల వాడకంపై రైతుకు సాయం చేసేందుకు ప్రణాళిక. రసాయన ఎరువులకు దూరంగా ప్రకృతి సిద్ధంగా సేద్యం చేసే పద్ధతికి ప్రోత్సాహకాలు.

100 కరువు జిల్లాలు

దేశవ్యాప్తంగా ఉన్న 100 కరువు జిల్లాల కోసం సమగ్ర చర్యలు. నీటి సమస్య తీర్చేందుకు ప్లాన్. రైతులకు లాభం వచ్చేలా ప్రత్యేక స్కీమ్‌‌లు

సోలార్ పవర్తో జీవనోపాధి

సోలార్ పంపులను గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించే విషయంలో రైతులకు సహాయపడేందుకు ఉద్దేశించిన ‘ఊర్జదాత’ను కలుపుకుని అన్నదాత పథకం విస్తరణ. బంజరు భూములున్న రైతులు సోలార్ పవర్ జనరేషన్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సా హం. సోలార్ పవర్ అమ్ముకోవడం ద్వారా రైతులు జీవనోపాధి పొందేందుకు అవకాశం.

కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులకు జియో ట్యాగింగ్

దేశవ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులను నాబార్డ్ మ్యాప్ చేసి, జియో ట్యాగ్ చేస్తుంది. తద్వారా రైతులు వాటిని త్వరగా గుర్తించి, తమ పంటను నిల్వ చేసుకునేందుకు అవకాశం. కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు నిధులను అందిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో కూడా గిడ్డంగుల నిర్మాణం. బ్లాక్/ మండల్ లెవెల్లో పీపీపీలో కొత్తగా గిడ్డంగులు ఏర్పాటు చేస్తారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ), సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ ) ఇందులో భాగస్వాములవుతాయి.

ఎస్​హెచ్​జీలతో విలేజ్ స్టోరేజ్ స్కీమ్

రూరల్ ఏరియాల్లో ఉమెన్ ఎంపవర్​మెంట్ కోసం స్వయం సహాయక సంఘాల (ఎస్​హెచ్​జీ) ఆధ్వర్యంలో విలేజ్ స్టోరేజ్ స్కీమ్ త్వరలో ప్రారంభం. ధాన్యలక్ష్మి పథకం కింద ముద్ర లేదా నాబార్డ్ నుంచి సాయం పొందేందుకు అవకాశం. మరిన్ని ఎస్​హెచ్​జీల ఏర్పాటు.

కిసాన్ రైల్, కృషి ఉడాన్

రైతుల కోసం ‘కిసాన్ రైల్’ స్కీమ్​ను రైల్వేస్ ప్రారంభించనుంది. అందులో రెఫ్రిజిరేటెడ్ కోచ్​లు ఉంటాయి. పండ్లు, కూరగాయలు, డైరీ ప్రొడక్టులు, చేపలు, మాంసాన్ని రైతులు సుదూర ప్రాంతాలకు త్వరగా, తక్కువ ఖర్చుతో పంపించేందుకు ఈ రైళ్లు ఉపయోగపడు తాయి. సివిల్ ఏవియేషన్ మినిస్ర్టీతో కలిసి కృషి ఉడాన్ స్కీమ్ ప్రారంభం. రైతులు పంటను విమానాల ద్వారా రవాణా చేసేందుకు సర్వీసులను జాతీయ,  అంతర్జాతీయ మార్గాల్లో నడుపుతారు. ఈ స్కీమ్ ఈశాన్య ప్రాంతాలు, ట్రైబల్ జిల్లాలకు ఎక్కువ ఉపయోగం. కిసాన్ రైల్, కృషి ఉడాన్ స్కీమ్​లలో పీపీపీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

ఒక ప్రొడక్ట్, ఒక జిల్లా

ఉద్యాన సాగు.. ఆహార ధాన్యాల ఉత్పత్తిని మించిపోయింది. ఉద్యాన పంటల మార్కెటింగ్ ఎగుమతుల కోసం ‘ఒక ప్రొడక్ట్, ఒక జిల్లా’ అనే ప్లాట్​ఫామ్ ప్రతిపాదన. ప్రతి జిల్లాకు ఒక పంటను ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రాల సాయంతో కేంద్రం ప్రోత్సాహం

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్

వర్షాలు పడే ఏరియాల్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్​మరింత విస్తరణ. వ్యవసాయేతర సీజన్లలో సోలార్ ఎనర్జీ, తేనెటీగల పెంపకం వంటి వాటికి ప్రోత్సాహం.

‘జైవిక్ ఖేతి’ పేరుతో ఆన్లైన్ పోర్టల్

ఆన్​లైన్ ఆర్గానిక్ మార్కెట్ మరింత బలోపేతం. సేంద్రీయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా ‘జైవిక్ ఖేతి’ పేరుతో ఆన్​లైన్ పోర్టల్ ఏర్పాటు.

మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ డబుల్

ప్రస్తుతం ఉన్న మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీని 2025 నాటికి డబుల్ చేయడం. 53.5 మిలియన్ టన్నుల నుంచి 108 మిలియన్ టన్నులకు పెంచేలా టార్గెట్.

క్రెడిట్ టార్గెట్ రూ.15 లక్షల కోట్లు

అగ్రికల్చరల్ క్రెడిట్ టార్గెట్ రూ.15 లక్షల కోట్లు. గతేడాది రుణ లక్ష్యం 13.5 లక్షల కోట్లుకాగా.. ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ 11 శాతం ఎక్కువ. వ్యవసాయ రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా.. తాజాగా కేంద్రం 2 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. రైతులు 3 లక్షల వరకు అప్పు తీసుకుంటే ఏడాదికి 7 శాతం వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇ‌‌‌‌–నామ్‌‌‌‌(నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్)తో ఇ-ఎన్‌‌‌‌డబ్ల్యూఆర్ (ఎలక్ర్టానిక్ నెగోషియబుల్ వేర్​హౌస్ రిసిప్ట్) అనుసంధానం.

ఆర్టిఫిషియల్ ఇన్సిమెంటేషన్ పెంపు

2025 నాటికి పాడి పశువుల్లో ఫుట్, మౌత్ డిసీజ్, బ్రుసెల్లోసిస్ ​లేకుండా చేయడం. గొర్రెలు, మేకల్లో పీపీఆర్​ను పారదోలడం.. ఆర్టిఫిషి యల్ ఇన్సిమెంటేషన్ (పశువుల్లో కృత్రిమ గర్భధారణ)ను 30 శాతం నుంచి 70 శాతానికి పెంచడం.

ఆల్గే, సీ వీడ్ పెంపకం

మెరైన్ ఫిషరీ రీసెర్సెస్ నుంచి ఆదాయాన్ని మరింత పెంచేందుకు ప్లాన్స్ చేస్తున్నామని చెప్పారు. మెరైన్ డెవలప్​మెంట్​లో భాగంగా ఆల్గే, సీ వీడ్(నాచు) పెంపకానికి ప్రోత్సాహం.

3,477 మంది సాగర్ మిత్రలు, 500 ఎఫ్పీఎంలు

ఫిషరీస్ సెక్టార్​లో యువతకు ప్రోత్సాహం. 3,477 మంది సాగర్ మిత్రలు, 500 ఫిష్ ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ల (ఎఫ్​పీఎం) ద్వారా ఫిషరీ ఎక్స్​టెన్షన్.

చేపల ఉత్పత్తి 200 లక్షల టన్నులు

2022-23 నాటికి చేపల ఉత్పత్తిని 200 లక్షల టన్నులకు తీసుకెళ్లడమే లక్ష్యం. మరో 45వేల ఎకరాల్లో అక్వాకల్చర్ ఏర్పాటుకు మద్దతు. 2024–25 నాటికి ఫిషరీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు పెంచేలా టార్గెట్.

35 లక్షల సోలార్ పంపు సెట్లు

ప్రభుత్వం 20 లక్షల మంది రైతులకు ‘స్టాండ్ అలోన్’ సోలార్ పంపు సెట్లు, 15 లక్షల మందికి ‘గ్రిడ్ కనెక్టెడ్’ పంపు సెట్లు అందజేస్తుంది. మొత్తంగా మూడు రకాల పంపు సెట్లను కేంద్రం ఇస్తుంది.