మైసూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంపొటి ఎస్టేట్‌కి వెళ్తే.. దారి పొడుగునా పచ్చని చెట్లే పలకరిస్తాయి. చల్లటి గాలులు సేదదీరుస్తాయి. ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల పైనుంచి కోయిలలు జోల పాటలు పాడతాయి. ఇక్కడ కోకో, జాజికాయ, వక్క లాంటి చెట్లు కూడా ఉన్నాయి. మొత్తం17, 000 చెట్లతో నందనవనంగా ఉండే ఈ ఎస్టేట్‌కి మరో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ పంటలన్నీ పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండిస్తారు. దానికి ప్రత్యేకంగా ఓ కారణం ఉందంటున్నారు ఈ ఎస్టేట్‌లో సేంద్రియ సాగు చేస్తున్న తంకచన్ చెంపొటి, అతని భార్య జెస్సీ. అదేంటంటే.
ఈ ఎస్టేట్‌లో ఉన్న 22 ఎకరాల్లో భార్యతో కలిసి పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులు సాగు చేస్తున్న తంకచన్ రిటైర్డ్ ఉద్యోగి. కేరళ కోహికోడ్‌లోని తెక్కుంకుట్టిలో పుట్టిన ఇతనికి చిన్నప్పట్నించీ వ్యవసాయమంటే బోలెడంత ఇష్టం. చిన్నప్పుడే తండ్రితో కలిసి రోజూ పొద్దున్నే పొలానికెళ్లేవాడు . స్కూల్ టైంకి తిరిగి ఇంటికొచ్చేవాడు. మళ్లీ సాయంత్రం స్కూల్ నుంచి నేరుగా పొలానికే వెళ్లేవాడు. ఆ తర్వాత ఉద్యోగమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు తంకచన్. ముప్పై ఏండ్లు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తూనే తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత తన సంపాదనంతా కూడబెట్టి 22 ఎకరాల ఎస్టేట్ కొన్నాడు. అలా 2005 లో తనకిష్టమైన వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యాడు.
కెమికల్ ఫ్రీ
తంకచన్ ఎస్టేట్‌లో వ్యవసాయం మొదలుపెట్టకముందు అందులో వెనిలా ప్లానిఫోలియా, కొబ్బరి, సపోటా .. లాంటివి ఎక్కువగా సాగు చేసేవాళ్లు. మంచి దిగుబడి కోసం కెమికల్స్‌తో నిండిన మందులు బాగా వాడేవాళ్లు. కానీ, ఆ పద్ధతిలో సాగు వద్దనుకున్నాడు తంకచన్. పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నాడు. అందుకోసం మొదటగా తమ భూమిలో పేరుకుపోయిన కెమికల్స్ అన్నింటినీ తీసేయాలనుకున్నాడు. దాన్ని కెమికల్ ఫ్రీగా మార్చేందుకు సుభాష్ పాలేకర్ పద్ధతిని ఫాలో అయ్యాడు. ఆవు పేడ, మూత్రంతో పాటు మరికొన్ని నేచురల్ ఇంగ్రెడియెంట్స్‌తో జీవామృతం తయారు చేసి పొలంలో చల్లాడు. అలా తన ఐదేండ్ల కష్టం తర్వాత భూమి నుంచి కెమికల్స్ అన్నీ వేరయ్యాయి. అయితే అందరిలా రొటీన్ పంటలు వద్దనుకున్నాడు తంకచన్. అలాగే వీలైనన్ని ఎక్కువ వెరైటీలు సాగు చేయాలనుకున్నాడు. అందుకోసం నాలుగు లేయర్ల మెథడ్‌ని అప్లై చేశాడు. అలా మొదటి లేయర్లో కొబ్బరి చెట్లు, రెండో లేయర్లో వక్క, మూడులో కోకో, జామ, మామిడి లాంటి పండ్ల తోటలు, నాలుగో లేయర్లో అల్లం, పసుపు, మొరం(గెనుసు) గడ్డలు లాంటివి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం తంకచన్ ఎస్టేట్‌లో ముప్పై ఏండ్ల నాటి కొబ్బరి చెట్లు వెయ్యికి పైగా ఉన్నాయి. అలాగే నాలుగు వేల వక్క, మూడు వేల ఐదొందల కోకో మొక్కలతో పాటు చెర్రీ, పనస, నిమ్మజాతి పండ్లు చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పంటలతో ప్రొడక్ట్స్ కూడా తయారుచేసి అమ్ముతారు ఈ జంట. చాలామంది రైతులు కోకో సీడ్స్‌ని కేజీ 50 రూపాయల చొప్పున అమ్ముతుంటారు. కస్టమర్స్ కూడా కేవలం సీడ్స్‌ని మాత్రం వాడి మిగతా ఫ్రూట్‌ని పడేస్తుంటారు. కానీ, వీళ్లు ఆ వేస్టేజ్‌ని ఉపయోగించుకోవడానికి కోకోతో సిరప్, జ్యూస్, వెనిగర్, లడ్డూలు తయారుచేశారు.
వాటిని మార్కెట్లోకి తెచ్చారు. కోకో సిరప్‌ని బ్రెడ్, చపాతీ, కేక్స్‌లో కలుపుకోవచ్చు. వీటితో పాటు ఫ్రూట్ జ్యూస్, జామ్, నిల్వ, రోటి పచ్చళ్లు కూడా అమ్ముతున్నారు. అయితే ఈ ఐడియా అంతా నా భార్య జెస్సీదే అంటాడు తంకచన్. సొంతంగా నేచురల్ ప్రొడక్ట్స్‌ని మార్కెట్లోకి తీసుకురావాలని తన టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసిందామె.
లక్షల్లో సంపాదిస్తున్నారు
సాగు చేసిన పంటలతో తయారుచేస్తున్న ప్రొడక్ట్స్ వల్ల ఐదింతలు ఎక్కువ లాభం వస్తుందట వీళ్లకు. ఒక్క కోకో ప్రొడక్ట్స్ ద్వారానే అన్ని ఖర్చులు పోను పది లక్షల రూపాయలు మిగులుతున్నాయట. మిగతా అన్ని పంటలు 25 లక్షల పైనే లాభం తెచ్చిపెడుతున్నాయట. లాభనష్టాలను పక్కనపెడితే ..‘‘ వ్యవసాయం నాకు ఏ కష్టాన్నైనా తట్టుకునే శక్తిని ఇచ్చింది. కొత్త విజన్‌ని పరిచయం చేసింది. పెరిగి పెద్దవుతున్న చెట్లను చూసిన ప్రతిసారీ
నాలో కొత్త ఉత్సాహం వస్తుంది’’ అంటున్నాడు తంకచన్. అంతేకాదు ఈ సేంద్రియ సాగుని స్పిరిచ్యువల్ ఫార్మింగ్ అని చెప్తున్నారు వీళ్లు. నేచర్‌తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వల్ల మొక్కల ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నారట ఈ జంట.
