జోరందుకున్న వరినాట్లు.. కూలీలు దొరక్క తిప్పలు

జోరందుకున్న వరినాట్లు.. కూలీలు దొరక్క తిప్పలు
  • కైకిలోళ్లు దొర్కుతలే
  • నాట్లేసేందుకు యూపీ, బీహార్​నుంచి కూలీలు 
  • రాష్ట్రవ్యాప్తంగా జోరందుకున్న వరినాట్లు 
  • పత్తి చేన్లలో పెరిగిన కలుపు 
  • ఊళ్లల్లో కూలీలు దొరక్క ఇతర రాష్ట్రాల నుంచి రప్పించుకుంటున్న రైతులు 

నారు ముదిరిపోతుండడంతో మెదక్ జిల్లా మాచారం గ్రామానికి చెందిన కొందరు రైతులు బీహార్​ నుంచి మగ కూలీలను పిలిపించుకున్నారు. ఎకరాకు రూ.4,500 చొప్పున గుత్తకు ఇస్తున్నారు. ఇదే జిల్లా నిజాంపేట మండలంలోని కొందరు రైతులు ఉత్తరప్రదేశ్​ నుంచి కూలీలను రప్పించి వరినాట్లు వేయిస్తున్నారు. వీరు ఎకరాకు రూ.4 వేల చొప్పున తీసుకుంటున్నారు. లోకల్​గా పది మంది మహిళలు ఒకరోజు ఎకరా పొలంలో నాటు వేస్తే... బీహార్, యూపీ కూలీలు నాలుగైదు ఎకరాల్లో నాట్లు వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. 

మెదక్/జనగామ/సంగారెడ్డి, వెలుగు: కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో వరినాట్లు ఊపందుకున్నాయి. అటు పత్తిలోనూ కలుపు విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలోని సాగు విస్తీర్ణంలో ఈ రెండు పంటల వాటా 85 శాతం కావడం, రెండు పనులూ ఒకేసారి రావడంతో కూలీలకు ఉన్నట్టుండి డిమాండ్​ పెరిగింది. కానీ గ్రామాల్లో సరిపడా కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరికి రూ.500 నుంచి రూ.600 ఇస్తామని ఊళ్లో తిరుగుతున్నా, చాలామంది ముందుకు రావట్లేదు. మన రాష్ట్రంలో నాట్లు, కలుపు తీసే పని కేవలం మహిళలదే అన్నట్లుగా చూస్తున్నారు. మగవాళ్లు ఈ పని చేయకపోవడం సమస్యగా మారిందని రైతులు అంటున్నారు. 

పక్క రాష్ట్రాల నుంచి రప్పిస్తున్రు.. 
ఈసారి వానాకాలంలో రాష్ర్ట వ్యాప్తంగా కోటి 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​అంచనా వేసింది. ఇందులో పత్తి 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో, వరి 40 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఇప్పటికే 90 శాతానికి పైగా పత్తి విత్తనాలు వేయడం పూర్తి కాగా, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు ఒక్కసారే వరినాట్లు వేస్తున్నారు. అటు పత్తిలోనూ కలుపు పెరగడంతో కూలీల కోసం పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతున్నారు. వారం, రెండు వారాల టైమ్​లో లక్షల ఎకరాల్లో నాట్లు వేయాల్సి రావడం, అందుకు సరిపడా కూలీలు లేకపోవడం సమస్యగా మారింది. ఒక్క ఎకరం నాటు వేయాలంటే నారు తీసే వారితో కలిపి పది మంది కూలీలు కావాలి. ఒక ఊరిలో ఒకరోజు వంద ఎకరాల్లో నాటు వేయాలంటే తక్కువలో వెయ్యి మంది అవసరం. కానీ ఆ స్థాయిలో కూలీలు దొరకడం లేదు. పత్తి సాగుచేసే గ్రామాల నుంచి కూలీలను తెచ్చుకుందామంటే అక్కడ కలుపుతీత పనులు జరుగుతున్నాయి. దీంతో వరినాట్లు ఎక్కువగా ఉన్న మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని కొందరు రైతులు బీహార్, యూపీ, జార్ఖండ్, ఉత్తరాంచల్​తదితర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది దాకా ఉన్న యువకులు రోజుకు 4 ఎకరాల్లో నాట్లు వేస్తుండడం విశేషం. ఇందుకోసం ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల దాకా తీసుకుంటున్నారు. బార్డర్​లో ఉన్న నిజామాబాద్​, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన రైతులు మహారాష్ట్ర నుంచి ఆటోల్లో కూలీలను రప్పిస్తున్నారు. వాళ్లకు రోజుకు రూ.300 కూలీ, ఉండడానికి చోటు, వండుకోడానికి కట్టెలను రైతులే ఇస్తున్నారు. 

యంత్రలక్ష్మిని పక్కన పెట్టిన సర్కార్..
ప్రస్తుతం మార్కెట్లో వరినాటు యంత్రాల ధర రూ.1.80 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఉంది. చిన్న, సన్నకారు రైతులు వీటిని కొని వినియోగించుకునే పరిస్థితి లేదు. పైగా ఈ వరినాటు యంత్రాలు ఉపయోగించాలంటే ప్రత్యేక ట్రేలలో నారు పోసుకోవాల్సి ఉంటుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు, వరినాటు యంత్రాలు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ ఇప్పించేందుకు సర్కారు ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా యంత్రలక్ష్మి పథకాన్ని పక్కన పెట్టేసింది. వ్యవసాయ యాంత్రీకరణ కింద ఈ ఏడాది బడ్జెట్​లో వరినాటు యంత్రాలకు ప్రత్యేకంగా ఫండ్స్​ కేటాయిస్తామని అప్పట్లో- వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. అలాగే నాట్ల బాధ లేకుండా వరిసాగులో వడ్లను డైరెక్ట్​ వెదజల్లే విధానంపై రైతులను చైతన్యం చేస్తామని చెప్పిన సర్కారు మాటలకే పరిమితమైంది.  వందల కోట్లు పెట్టి రైతు వేదికలు నిర్మించినప్పటికీ ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. 

మేమే పత్తి కలుస్తున్నం...  
మేము ఎకరా పత్తి చేను పెట్టినం. వానలకు కలుపు పెరిగింది. దాన్ని తీసేందుకు కూలీలు దొరుకుతలేరు. కొందరేమో డబుల్​ కూలి అడుగుతున్నరు. ఒక్కొక్కరికి 800, వెయ్యి ఇయ్యాలంటే మాకేం మిగలయి. అందుకే  మా కుటుంబ సభ్యులమంతా కలిసి రోజు కొంత చేనులో కలుపు తీసుకుంటున్నం. 
- భోగ భాగ్య, సత్యగామ, నారాయణఖేడ్​ మండలం, సంగారెడ్డి జిల్లా