కామారెడ్డి జిల్లాలో పకడ్బందీగా విత్తనాల పంపిణీ

కామారెడ్డి జిల్లాలో పకడ్బందీగా విత్తనాల పంపిణీ
  • సబ్సీడిపై జీలుగ, జనుము విత్తనాలు సొసైటీ ద్వారా అందజేత 
  • పూర్తి స్థాయిలో రాకపోవడంతో బారులు తీరుతున్న రైతులు 
  • మిగతా విత్తనాలు బహిరంగ మార్కెట్లో అమ్మకాలు
  • నకిలీ సీడ్స్ అమ్మకుండా నాలుగు టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు 

కామారెడ్డి​, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో విత్తనాల పంపిణీకి వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీపై జీలుగ, జనుము విత్తనాలను సొసైటీల ద్వారా పంపిణీ చేస్తుండగా మిగతా పంట విత్తనాలను బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉంచారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా, విత్తనాల పంపిణీ  ప్రక్రియ సజావుగా చేపట్టేందుకు నాలుగు టాస్క్ ఫోర్స్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఖరీఫ్ సీజన్ లో కామారెడ్డి జిల్లాలో  5,14,686 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  

వరి 78,492 క్వింటాళ్లు,  సోయా 25,633 క్వింటాళ్లు,  పత్తి 287,   కంది 419,  పెసర 400, మినుములు 421 క్వింటాళ్లు కలిపి మొత్తం  1,10,282 క్వింటాళ్ల  విత్తనాలు అవసరం కానున్నాయి.  వీటితో పాటు 4,500 ప్యాకెట్ల పత్తి విత్తనాలు మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. జీలుగ 5,200 క్వింటాళ్లు, జనుము 1,249 క్వింటాళ్ల విత్తనాలను కామారెడ్డి  జిల్లాకు కేటాయించారు.  బుధవారం నాటికి జీలుగ  3,682 క్వింటాళ్లు , జనుము 632 క్వింటాళ్లు జిల్లాకు చేరాయి.  వీటిని సొసైటీల ద్వారా రైతులకు సప్లయ్​ చేస్తున్నారు.  దీంతో సెంటర్ల వద్ద ఉదయం నుంచే  రైతులు బారులు తీరుతున్నారు.  

కేటాయింపులకు అనుగుణంగా విత్తనాలు జిల్లాకు చేరకపోవడంతో రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి లైన్లలో  నిలబడుతున్నారు.  పంపిణీ  ప్రారంభించిన ఫస్ట్​డే  కామారెడ్డి మార్కెట్​ యార్డులోని పంపిణీ  కేంద్రం వద్ద వందలాది మంది రైతులు ఉదయం నుంచే లైన్లలో నిల్చోగా..  తోపులాట జరిగింది.  దీంతో పోలీసులు వచ్చి పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  రాజంపేంట మండలం ఆర్గొండలో  రైతులు ఎండలో  లైన్లలో నిలబడలేక రాళ్లను వరుసలో పెట్టారు.  సెంటర్ల వద్ద రైతులు బారులు తీరకుండా అవసరానికి అనుగుణంగా సప్లయ్​ చేయడానికి యంత్రాంగం ప్రయత్నిస్తోంది.  డిమాండ్​కు అనుగుణంగా సీడ్స్​ వస్తాయని తొందరపడొద్దని అగ్రికల్చర్ ఆఫీసర్లు రైతులకు చెబుతున్నారు. 

టాస్క్​ఫోర్స్​ టీమ్స్​

నకిలీ విత్తనాలు అమ్మకుండా, సీడ్స్​ను పక్కదారి పట్టించకుండా  చూసేందుకు జిల్లాలో 4 టాస్క్​ఫోర్స్​ టీమ్స్​ ఏర్పాటు చేశారు.  ఈ టీమ్​లో  అగ్రికల్చర్​, రెవెన్యూ, పోలీసు ఆఫీసర్లు ఉంటారు.  వీరు ఆయా ఏరియాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలి.   మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా పర్యవేక్షణ చేయటంతో పాటు, ఎవరైనా అమ్మితే వారిని పట్టుకోవడానికి ఈ టీమ్స్ ఏర్పాటు చేశారు. 

సమస్యలు తలెత్తకుండా పంపిణీ

ఈ సీజన్లో విత్తనాల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నాం.  రైతుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తాం.  జీలుగ, జనుము సీడ్స్​ సొసైటీల ద్వారా పంపిణీ చేస్తున్నాం.  జిల్లాకు కేటాయింపులకు అనుగుణంగా సీడ్స్​ వస్తాయి.  రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  

భాగ్యలక్ష్మీ,  జిల్లా అగ్రీకల్చర్​ ఆఫీసర్​, కామారెడ్డి