- కొత్త కోర్సుల కోసం 140 కాలేజీల దరఖాస్తులు
- ఏఐ ఎంఎల్ కోసం 58, సైబర్ సెక్యూరిటీకి 31 కాలేజీల ఇంట్రెస్ట్
- మారుతున్న ట్రెండ్.. ఉపాధి దిశగా అడుగులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ ఎడ్యుకేషన్ ట్రెండ్ మారుతోంది. సంప్రదాయ కోర్సుల కంటే ఐటీ, మేనేజ్మెంట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆయా కొత్త కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం కాలేజీల నుంచి దరఖాస్తులు తీసుకుంది. కొత్త కోర్సుల కోసం 140 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, ప్రత్యేకంగా పాత కోర్సుల్లో మార్పుల కోసం మరో 60 కాలేజీల దాకా టీజీసీహెచ్ఈకి అప్లై చేసుకున్నాయి.
ఇంజినీరింగ్ లో మాదిరిగానే డిగ్రీలోనూ ఏఐ ఎంఎల్‌కు క్రేజ్ పెరిగింది. డిగ్రీ ఏఐ ఎంఎల్ కోర్సుకు ఏకంగా 58 కాలేజీలు అప్లై చేసున్నాయి. అత్యధికంగా ఓయూ పరిధిలో 35, శాతవాహన పరిధిలో 9, కేయూ పరిధిలో ఏడు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ తర్వాత బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 31 కాలేజీలు, బీకామ్ డిజిటల్ మార్కెటింగ్ కోసం 26, బీబీఏ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ కోసం 12 కాలేజీలు అప్లై చేశాయి. మరోవైపు పీజీలోనూ కొత్త కోర్సులకు కొన్ని కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి.
కీలక కోర్సులను పట్టించుకోలె..
ఉపాధి లభించే కొత్త కోర్సులపై కాలేజీలు ఆసక్తి చూపించలేదు. ప్రధానంగా బీబీఏ ఎయిర్ పోర్టు, ఎయిర్ లైన్, ఏయిర్ స్పేర్ అండ్ ఏయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, బీబీఏ మారిటైమ్ టెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సు, బీబీఏ ట్రావెల్, టూరిజం అంట్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, బీఏ లాండ్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కోర్సులకు కేవలం ఒక్కో కాలేజీ మాత్రమే అప్లై చేయడం గమనార్హం.
అయితే, ఈ కోర్సులన్నింటికీ ఇంటర్నిషిప్ కోసం తప్పుకుండా వాటికి సంబంధించిన సంస్థలతో ఎంఓయూ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న కాలేజీలకే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతి ఇస్తుంది. త్వరలో ఈ కాలేజీ మేనేజ్మెంట్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, వీటిపై అవగాహన కల్పిస్తామని టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
