ఇసుక అక్రమ రవాణాకు ఏఐ కెమెరాతో చెక్..నంబర్  ప్లేట్  ఆధారంగా  లారీలు, ట్రక్కుల గుర్తింపు 

ఇసుక అక్రమ రవాణాకు ఏఐ కెమెరాతో చెక్..నంబర్  ప్లేట్  ఆధారంగా  లారీలు, ట్రక్కుల గుర్తింపు 
  • నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రయోగాత్మకంగా ఏఐ కెమెరా ఏర్పాటు
  • విజయవంతమైతే  రాష్ట్ర వ్యాప్తంగా అమలు 

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ప్రభుత్వం ఏఐని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇసుక రవాణాతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే అక్రమార్కులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈక్రమంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
అక్రమ రవాణాను అడ్డుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని భావించిన సర్కార్  రాష్ట్రంలో మొదటిసారి నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ఆర్టిఫిషియల్  ఇంటలిజెన్స్  కెమెరాను ఏర్పాటు చేసింది.

ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులు..

సాధారణంగా నదులు, పెద్ద వాగుల నుంచి వచ్చే ఇసుకను కమర్షియల్​ అవసరాలకు అమ్ముతుంటారు. ఆ ఇసుకను విక్రయించేందుకు టీఎస్‌‌‌‌ఎండీ ద్వారా ఇసుక రీచ్​లను ఏర్పాటు చేసి టన్నుల చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే వాగులు, చిన్న చిన్న నదుల నుంచి స్థానిక అవసరాల కోసం ‘మన ఇసుక.. మన వాహనం’ ద్వారా ఇసుకను అమ్ముతుంటారు. ఈక్రమంలో ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకుండా అక్రమార్కులు ఇసుకను అక్రమంగా రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనికి చెక్‌‌‌‌ పెట్టేందుకు ఇప్పటి వరకు భూగర్భ గనుల శాఖ అధికారులు మాత్రమే చర్యలు తీసుకున్నారు. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో పట్టుబడే ఇసుక లారీలు, ట్రాక్టర్లను మైనింగ్  డిపార్ట్ మెంట్ కు అప్పగిస్తే వాటికి ఫైన్లు  విధిస్తున్నారు. పట్టుబడిన ఇసుకను వేలం ద్వారా విక్రయించే వాళ్లు. అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టేందుకు ప్రభుత్వం తాజాగా కొత్త పాలసీని తీసుకువచ్చింది.

ఏఐ కెమెరాతో గుర్తింపు.. 

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇసుక రీచ్​లు, నదులు, చెరువుల నుంచి లారీలు, ట్రక్కుల ద్వారా ఇసుక తరలింపుపై నిఘా పెట్టింది. వెహికల్స్​ను  గుర్తించేందుకు ఏఐ కెమెరాను ఏర్పాటు చేసింది.

తెలంగాణ మినరల్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  అధికారులు హైదరాబాద్​లోని ట్రిపుల్  ఐటీ ఇన్నోవేషన్ హబ్ తో ఒప్పందం కుదుర్చుకొని నల్గొండ జిల్లా చిట్యాలలో హైవేపై ఈ కెమెరాను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. ఆటో మెటిక్  నంబర్  ప్లేట్  రికగ్నిషన్  సాఫ్ట్ వేర్  ద్వారా పని చేసే ఈ కెమెరా ద్వారా ఇసుకను తరలిస్తున్న వెహికిల్స్  నంబర్  ప్లేట్లను సాఫ్ట్ వేర్ లో నిక్షిప్తం చేశారు. అలాగే ఆర్టీఏ పోర్టల్ కు ఈ వివరాలను అనుసంధానం చేయడంతో లారీ, ట్రక్కులను రిజిస్టర్  చేశారా? లేదా? అనే వివరాలు వెంటనే నమోదవుతాయి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించిన తెలంగాణ మినరల్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  అధికారులు చిట్యాల టోల్ గేట్  వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

అయితే ఈ కెమెరాలు హ్యాండ్ మేడ్  నెంబర్  ప్లేట్లను గుర్తించకపోవడం సమస్యగా మారింది. దీంతో ఏఐ కెమెరాను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రయోగం సక్సెస్​ అయితే భవిష్యత్ లో అన్ని హైవేలపై ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా పాలసీని రూపొందించారు. ఒక్కో కెమెరాకు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుండగా 24 గంటలు వెహికల్స్ ను గుర్తించేలా ప్రత్యేక డ్యాష్  బోర్డు ఏర్పాటు చేశారు.