
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇకపై కేవలం సాంకేతికత ట్రెండ్ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలు, సమాజాలను పునర్నిర్మిస్తోంది. ప్రతి సంవత్సరం పన్నెండు మిలియన్లకుపైగా యువకులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశిస్తున్న భారతదేశంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది కేవలం మార్పు వేవ్ కాదు. ఏఐ మనం ఎలా జీవిస్తాం, ఎలా నేర్చుకుంటాం, ఎలా పని చేస్తాం అనే మొత్తం విధానాలను మార్చేసే సునామీ. ఇది భయాందోళనలను రేకెత్తించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ కాదు.
మన యువత భవిష్యత్తులో ఏమి అవుతుందో అర్థం చేసుకోవడానికి నావంతుగా సహాయం చేయడమే నా ఉద్దేశ్యం. తద్వారా యువత భయం, ఎటువంటి తడబాటు లేకుండా తమను తాము అన్నివిధాలుగా సిద్ధం చేసుకుని అభివృద్ధి చెందగలరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక సంప్రదాయ ఉద్యోగాలను రాత్రికి రాత్రే మార్చేయదు. కానీ, స్థిరంగా, తిరుగులేనివిధంగా అది భర్తీ చేస్తుంది. ఈ మార్పుకు అనుగుణంగా తగిన ప్రణాళిక వేసుకుని, తిరిగి నైపుణ్యం పెంపొందించుకుని దానికి అనుగుణంగా ఉండేవారి ఉపాధికి ఎటువంటి ఢోకా ఉండదు.
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయ ఉద్యోగాలు దాదాపు కనుమరుగు అవుతాయి. ఈ అంశాన్ని మనం కప్పిపుచ్చకూడదు. రిపిటీషన్, ఊహించదగిన ప్రక్రియలపై ఆధారపడిన పనులు అదృశ్యమవుతాయి. సాఫ్ట్‌వేర్ కోడింగ్, ప్రోగ్రామింగ్, డేటా ఎంట్రీ, క్లరికల్ పని, ప్రాథమిక అకౌంటింగ్, టెలి కాలింగ్, ట్రెడిషనల్ సేల్స్ క్రమక్రమంగా వాడుకలో లేకుండా కనుమరుగవుతాయి. త్వరలో రవాణా, లాజిస్టిక్స్, రిటైల్ వంటి రంగాలలోని కొన్ని భాగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలు, రోబోటిక్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
ఇది వ్యక్తిగత కెరీర్స్ మాత్రమే కాదు, ఉద్యోగస్వామ్యంపై ఆధారపడిన రంగాలపై కూడా ఏఐ ప్రభావం గణనీయంగా ఉంటుంది. లక్షలాది మంది సంప్రదాయ కొలువులను కోల్పోతే మొదటగా నష్టాలను ఎదుర్కొనే సెక్టార్లలో రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, వినియోగదారు మార్కెట్ల వంటి రంగాలు ఉంటాయి. ఖరీదైన ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు మందగిస్తాయి. ఈ ప్రభావం వినియోగదారుల ఖర్చులు, బోర్డ్రూమ్స్, ఫ్యాక్టరీలకు మాత్రమే పరిమితం కాదు. ఇది విస్తృత ఆర్థిక వ్యవస్థ, గృహ ఆదాయాలలోకి చొచ్చుకుపోతుంది.
ఐదేళ్లలో కొత్త ఆవిష్కరణ అవసరం
తమ ప్రస్తుత ఉద్యోగాలు రాబోయే దశాబ్ద కాలంపాటు సురక్షితమని ఇప్పటికీ నమ్మే చాలామంది యువ నిపుణులను నేను కలుస్తున్నాను. వారిది ప్రమాదకరమైన భ్రమ. నిజం ఏమిటంటే చాలా కెరీర్‌లకు రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాలలో తిరిగి ఆవిష్కరణ అవసరం ఉంటుంది. రీస్కిల్లింగ్ ఇకపై ఐచ్ఛికం కాదు. ఇది డిఫాల్ట్. అప్‌గ్రేడ్ అవడంలో విఫలమైనవారు ఎంత కష్టపడి పనిచేసినా తమను తాము అసంపూర్ణంగా భావిస్తారు.
భారతీయ యువతకు ఇది ఒకవైపు సవాలు, మరోవైపు అవకాశంగా రెండువిధాలుగా అవగతం చేసుకోవాలి. మనం నిశ్చలంగా ఉంటే పెరుగుతున్న మన జనాభానే ఓ విపత్తుగా మారవచ్చు. కానీ, మనం వేగంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే పోటీతత్వం, ఏఐపై అవగాహన కలిగిన శ్రామిక శక్తిగా మారితే అది మనకు గొప్ప ప్రయోజనం కూడా కావచ్చు.
విద్యారంగంలో మార్పు రావాలి
భారతదేశంలో అతిపెద్ద యజమానులు, ఆర్థిక చోదకులు ఉన్న మన విద్యారంగం దాని స్వీయ
మదింపును ఎదుర్కొంటోంది. ఏఐ -ఆధారిత వ్యక్తిగతీకరించిన అభ్యాసం, విస్తృతమైన పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సంస్థలు, సాధారణ తరగతి గదుల అవసరాన్ని తగ్గిస్తుంది. ఇప్పటికే తమ విద్యాసంస్థల్లో సీట్లను పూర్తిగా భర్తీ చేయడానికి ఇబ్బంది పడుతున్న అనేక ప్రైవేట్ సంస్థలు, వాస్తవ బోధన, మార్కెట్ -సంబంధిత నైపుణ్యాల వైపు మొగ్గు చూపకపోతే కుప్ప కూలిపోతాయి.
ప్రదర్శించదగిన సామర్థ్యం కంటే డిగ్రీలు తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇది కూడా ఆర్థికరంగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఏఐ సవాలును స్వీకరించలేని పాఠశాలలు, కళాశాలలు మూసివేతకు గురవుతాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. మరోవైపు ఏఐ, హైబ్రిడ్ లెర్నింగ్, నైపుణ్య- కేంద్రీకృత పాఠ్యాంశాలను స్వీకరించే సంస్థలు వృద్ధి చెందుతాయి. కాబట్టి, ఈ మారుతున్న ప్రపంచంలో తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు మన యువత ఏం చేయాలనేది ముందుగా బేరీజు వేసుకోవాలి. సంప్రదాయ ఉద్యోగ భద్రతను అనుసరించడం ఆపాలి. పెద్ద కంపెనీలలో శాశ్వత ఉద్యోగాలు అరుదుగా మారుతున్నాయి.
ఫ్లెక్సిబిలిటీ ఒక శక్తి
మీరు బహుళ సంస్థలతో కలిసి పనిచేయగల ప్రాజెక్ట్ ఆధారిత, గిగ్-ఆధారిత కెరీర్ మార్గాన్ని ఎంచుకోవాలి. అవసరాలకు అనుగుణంగా మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ అనేది అస్థిరతగా కాకుండా ఒక శక్తిగా మారుతుంది. ఒక సంస్థ వ్యవస్థాపక మనస్తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కంపెనీని ప్రారంభించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రతి ఒక్కరూ వ్యవస్థాపకుడిలా ఆలోచించాలి. చురుగ్గా ఉండాలి. అవకాశాలను వెతకాలి.
సమస్యల పరిష్కారానికి సూచనలను పాటించకుండా కఠినమైన సమస్యలను పరిష్కరించడానికి మిమ్మల్ని ప్రేరేపించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. హ్యుమానిటీని, సాంకేతికతను సమతుల్యం చేసుకోవాలి. యంత్రాలు లాజిక్, వేగంలో మనల్ని అధిగమిస్తాయి, కానీ, యంత్రాలు మానవత్వం, సానుభూతి, ఒప్పించడం, కల్చరల్ అండర్స్టాండింగ్లో సమర్థవంతంగా పనిచేయలేవు. టీమ్స్‌ను ప్రేరేపించగలిగేవారు, క్లయింట్‌లతో కనెక్ట్ అవ్వగలిగేవారు, మానవ సంక్లిష్టతను నావిగేట్ చేయగల లీడర్స్ ఎల్లప్పుడూ డిమాండ్‌లో ఉంటారు.
ఒక రంగంలో ఉద్యోగ నష్టం అనేక ఇతర రంగాలను ప్రభావితం చేస్తుంది. ఈ డైనమిక్స్ గురించి అవగాహన ఉండాలి. ఇది మీరు కెరీర్, పెట్టుబడులు, వ్యవస్థాపకత గురించి తెలివిగా ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతుంది.
దేశం కూడలిలో ఉంది
భారతదేశం.. ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన దశలో ఉంది. మన యువకులు, ఆశయాలు కలిగినవారు. మనం అభివృద్ధి చెందుతున్నాం. కానీ, మనం కూడా దుర్బలంగా ఉన్నాం. ఎందుకంటే మన ఆర్థిక నిర్మాణం ఇప్పటికీ శ్రమతో కూడిన పరిశ్రమలు, సంప్రదాయ విద్యపై ఎక్కువగా ఆధారపడి ఉంది. జరగబోయే మార్పుకు మనం సిద్ధంగా ఉన్నా, లేకపోయినా ఏఐ మనల్ని అభివృద్ధి చెందడానికి ఫోర్స్ చేస్తుంది. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలి.
పునఃనైపుణ్య కార్యక్రమాలను రూపొందించాలి. డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం కొద్దిమందికే కాకుండా చాలామందికి ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవాలి. ఆ బాధ్యత మనపైనే ఉంటుంది. ఏ ప్రభుత్వం లేదా కంపెనీ మీ కెరీర్‌ను భవిష్యత్తుకు సిద్ధం చేయలేవు.
భయపడాల్సిన తుపాను కాదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) భయపడాల్సిన తుపాను కాదు. ఇది నావిగేట్ చేయాల్సిన పెద్ద అల. దానిపై ప్రయాణించడం నేర్చుకున్నవారు పాత కఠినమైన ఉద్యోగాల వ్యవస్థ కంటే ఎక్కువ అవకాశాలు, ఎక్కువ స్వేచ్ఛ, మరింత సంతృప్తిని పొందుతారు. ప్రతిఘటించేవారు తాము చేసే పనులకు ఇకపై విలువ ఇవ్వని ఆర్థిక వ్యవస్థలో కొట్టుమిట్టాడుతారు.
భారతదేశం భవిష్యత్తు ఏఐ ఎన్ని ఉద్యోగాలు తీసుకుంటుందనేదాని ద్వారా నిర్ణయం కాదు. మన యువత ఎంత త్వరగా కొత్త విలువను సృష్టించడానికి తమను తాము తిరిగి ఆవిష్కరించుకోగలరనే దాని ద్వారా నిర్ణయిం అవుతుంది. ప్రతి యువ భారతీయుడు తనను తాను అడగవలసిన ప్రశ్న... నేను యంత్రాలతో పోటీ పడటానికి సిద్ధమవుతున్నానా లేదా వాటితోపాటు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్నానా? అనిప్రశ్నించుకోవాలి.
ఇది ఒక మేల్కొలుపు పిలుపు
కొందరు దీనిని నిరాశావాద ప్రవచనంగా చదవవచ్చు. కానీ, నేను దీన్ని ట్రాన్స్ఫర్మేషన్కు ఒక రోడ్ మ్యాప్‌గా చూస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే ఈ మార్పును ముందుగానే గ్రహించి సిద్ధమయ్యేవారికే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన యువత ఉపాధికి డిగ్రీలపై మాత్రమే ఆధారపడలేరు. కచ్చితంగా మన విద్యావ్యవస్థ ఇప్పటికీ అందిస్తున్న సాధారణ, ఔట్‌డేటెడ్ కోర్సులు, బట్టీ పట్టడం, రాత పరీక్షల అర్హతలు ఇకపై కెరీర్‌లకు హామీ ఇవ్వవు. అయితే, సృజనాత్మకత, సమస్య పరిష్కారం, భావోద్వేగ మేధస్సు, నాయకత్వం, అనుకూలత వంటివి మెషిన్స్ సులభంగా ప్రతిరూపం చేయలేని నైపుణ్యాలు. వీటితోపాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల అవగాహన చాలా అవసరం.
డేటా అక్షరాస్యత, ఏఐపై అవగాహన, ఏఐ కోడింగ్, ఆటోమేటెడ్ సిస్టమ్‌లతో పని చేసే సామర్థ్యం..తెలుసుకోవడం ప్రాథమికంగా మారతాయి. రీస్కిల్లింగ్ డిఫాల్ట్‌గా ఉండాలి. దీన్ని అభివృద్ధి చేసుకోలేనివారు వెనకబడిపోతారు.
- కె. కృష్ణ సాగర్ రావు, నేషన్ బిల్డింగ్ ఫౌండేషన్ చైర్మన్ -