హైదరాబాద్​లో ఏఐ గ్లోబల్​ సమిట్​

హైదరాబాద్​లో ఏఐ గ్లోబల్​ సమిట్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ (ఏఐ) గ్లోబల్​ సమిట్​కు హైదరాబాద్​ వేదిక కానుంది. జూన్​లో ఈ సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టిందని ఐటీ, ఇండస్ట్రీస్​ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్​లో జరిగిన టెలి పర్ఫార్మెన్స్​ ఇంప్రెస్సివ్​ఎక్స్​పీరియన్స్​సమిట్​లో ఆయన మాట్లాడారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఏఐ గ్లోబల్ సమిట్ కు ఆహ్వానిస్తున్నామని చెప్పారు.  హైదరాబాద్ ను ఏఐ టెక్నాలాజీకి హెడ్ క్వార్టర్స్ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. డెడికేటెడ్​గా ఏఐ సిటీ స్థాపనకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదన్నారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్​అనువైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించిందని. టూరిజం గ్రోత్ 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 1990వ దశకంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. టెలి పర్ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈవో అనీష్ ముక్కర్ ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. 

హైదరాబాద్‌లో​ స్కిల్​ వర్సిటీ..

రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, వాటి నుంచి వేలాది మంది ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని మంత్రి శ్రీధర్​బాబు  తెలిపారు. అట్ల వచ్చే ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్లలో స్కిల్స్​ పెంపొందించేందుకు హైదరాబాద్​లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్లాన్​ చేస్తున్నామని చెప్పారు. ఐఎస్బీ తరహాలో ఈ వర్సిటీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అందిస్తుందన్నారు.

టాటా, మహీంద్ర లాంటి కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ కుటుంబానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉన్నారని తెలిపారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నిర్వహిస్తున్నామని, తమ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ప్రజాకర్షక పాలన అందిస్తున్నదని పేర్కొన్నారు. కొత్త ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నామని, త్వరలోనే వాటిని ఆవిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు.