ఏపీలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మంగళవారం ( నవంబర్ 18 ) హైదరాబాద్ లో వైసీపీ అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వెంకట్ రెడ్డి నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారుడైన టీటీడీ మాజీ ఏఎస్ఓ సతీష్ కుమార్ మరణం అంశంపై ఓ టీవీ ఛానల్ లో ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు
ఏపీ ప్రభుత్వంతో పాటు, సీఎం చంద్రబాబుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ వెంకట్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తాడిపత్రికి చెందిన టీడీపీ నేత. టీడీపీ నేత ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వెంకట్ రెడ్డి కూకట్ పల్లిలో ఉంటున్నట్లు గుర్తించారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం వెంకట్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెంకట్ రెడ్డిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు పోలీసులు.
అయితే.. వెంకట్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. ప్రభుత్వంలో లోపాలు ఎత్తిచూపినందుకే వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆరోపిస్తోంది వైసీపీ.
