గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఆర్థిక ఫలితాలు, భవిష్యత్ అంచనాలు టెక్ రంగంలో కొత్త చర్చకు దారితీశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా దూసుకొస్తుండటంతో గ్లోబల్ ఐటీ మార్కెట్లో పోటీ తారాస్థాయికి చేరింది. ఫలితంగా అనేక వ్యాపార విభాగాల్లో ప్రైసింగ్ ప్రెషర్ పెరుగుతోందని, క్లయింట్లను దక్కించుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలకే సర్వీసులు ఆఫర్ చేయాల్సి వస్తోందని యాక్సెంచర్ సీఈఓ జూలీ స్వీట్ వెల్లడించారు.
యాక్సెంచర్ 4వ త్రైమాసికంలో సుమారు రూ.లక్షా 77వేల 460 కోట్లు ఆదాయన్ని నమోదు చేసింది. అలాగే ఇదే కాలంలో కంపెనీ కొత్త బుకింగ్స్ రూ.2లక్షల 10వేల 900 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం సంవత్సరానికి గాను ప్రాజెక్టు బుకింగ్స్ విలువ దాదాపు రూ.8లక్షల 2వేల 750 కోట్లుగా నమోదైంది.
ఏఐ రాకతో టెక్నాలజీ డెలివరీ మోడల్ పూర్తిగా మారిపోతోంది. తక్కువ సిబ్బందితో ఎక్కువ పనిని పూర్తి చేసే వీలు కలుగుతుండటంతో.. సాంప్రదాయ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ నమూనాలకు డిమాండ్ మారుతోంది. అయినప్పటికీ డేటా, ఏఐ విభాగాల్లో కొత్త నైపుణ్యాల కోసం డిమాండ్ పెరుగుతుండటంతో యాక్సెంచర్ ఉద్యోగుల సంఖ్యను 5 శాతం పెంచుకుని 8లక్షల 14వేల 391కి చేర్చింది. అయితే ఏఐ ఆటోమేషన్ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ వేగం కాస్త మందగించనుంది.
రాబోయే ఆర్థిక సంవత్సరంలో 3 నుంచి 6 శాతం రెవెన్యూ వృద్ధిని అంచనా వేస్తున్నప్పటికీ.. మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీని తట్టుకునేందుకు ప్రైసింగ్ ఒత్తిడి కొనసాగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. డేటా, ఏఐ, లార్జ్-స్కేల్ ప్రాజెక్ట్‌లే భవిష్యత్తులో వ్యాపారానికి కీలకంగా నిలుస్తాయని యాక్సెంచర్ భావిస్తోంది.
