ఏఐతో పాస్ వర్డ్‌‪లకు ముప్పు.. సెక్యూర్డ్ గా ఉండాలంటే ...

ఏఐతో పాస్ వర్డ్‌‪లకు ముప్పు.. సెక్యూర్డ్ గా ఉండాలంటే ...

ప్రపంచం మొత్తం ఇప్పుడు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వైపు చూస్తోంది. ఎక్కడ చూసినా చాట్ జీపీటీ లాంటి కొత్త సాంకేతికతపై యువత రోజుకో టెస్ట్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది AI పట్ల భయపడుతుండగా, మరికొందరు దాని వల్ల వచ్చే లాభాల కోసం అన్వేషిస్తున్నారు. ఏఐ వల్ల ఎన్ని లాభాలున్నప్పటికీ.. దాని వల్ల  ప్రతికూలతలూ లేకపోలేదు. గత రెండు నెలల కాలంలోనే దీని వల్ల చాలా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పుడు మరో పిడుగు లాంటి వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. దీని వల్ల మన పాస్ వర్డ్ లు ప్రమాదంలో పడవచ్చని తెలిపింది. ఎందుకంటే AI వాటిని నిమిషంలోపే ఛేదించగలదని హెచ్చరిస్తోంది.

AI ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయనుందని ఓ సర్వే తెలిపింది. హోమ్ సెక్యూరిటీ హీరోస్ నిర్వహించిన తాజా అధ్యయనంలో సాధారణంగా మనం ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో 50 శాతానికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిమిషంలోపే క్రాక్ చేయవచ్చని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో దాదాపు 15,680,000 పాస్‌వర్డ్‌ల జాబితాను పరీక్షించడానికి PassGAN అనే AI పాస్‌వర్డ్ క్రాకర్‌ను ఉపయోగించింది. దీని వల్ల దాదాపు 51 శాతం సాధారణ పాస్‌వర్డ్‌లను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలో ఉల్లంఘించవచ్చని,65 శాతం పాస్‌వర్డ్‌లను గంటలోపే క్రాక్ చేయవచ్చని వెల్లడించింది. అంతేకాకుండా ఒక నెలలో 81 శాతం పాస్‌వర్డ్‌ల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందని కూడా అధ్యయనం వెల్లడించింది.

నిజానికి ఏఐ.. మీ పాస్‌వర్డ్‌ను ఒక నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే క్రాక్ చేయడానికి కారణం చిన్న, సాధారణ పాస్ వర్డ్ లు ఉపయోగించడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.  ఉదాహరణకు, మీ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ లాంటివి. దాంతో పాటు18 అక్షరాల పొడవు ఉండే పాస్‌వర్డ్‌లను గుర్తించడానికి ఏఐకి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి18 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని తెలుస్తోంది.  కేవలం నంబర్‌లు మాత్రమే ఉండే పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి ఏఐకి కనీసం 10 నెలల సమయం పట్టగా.. సింబల్స్, సంఖ్యలు, పెద్ద, చిన్న(క్యాపిటల్, స్మాల్) అక్షరాల కలయికతో కూడిన పాస్‌వర్డ్‌లు అత్యంత సురక్షితమైనవని అధ్యయనం చెబుతోంది. ఎందుకంటే వాటిని క్రాక్ చేయడానికి ఏఐకి 6 క్విన్టిలియన్ సంవత్సరాల వరకు పట్టవచ్చని  తెలిపింది.

పాస్ వర్డ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే .. ?

పాస్ వర్డ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే మొదటగా మామూలు పాస్ వర్డ్ లను పెట్టుకోకూడదు. ప్రత్యేకించి అంకెలు మాత్రమే ఉండేవి కాకుండా  కనీసం 15 అక్షరాల పొడవు ఉండే పాస్‌వర్డ్‌లను ఎంచుకోవాలి. అందులోనూ అక్షరాలు, చిహ్నాలు, సంఖ్యలు, అప్పర్, లోయర్- కేస్ అక్షరాలతో పాస్ వర్డ ను పెట్టుకోవాలి. ఈ రకమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడంపై మీకు ఏవైనా సమస్యలు ఉంటే, మీరు పాస్‌వర్డ్ మేనేజర్ ను ఉపయోగించవచ్చు.

పాస్‌వర్డ్‌లో కనీసం రెండు అక్షరాలు (పెద్ద, చిన్న అక్షరాలు), సంఖ్యలు, చిహ్నాలు ఉండాలని అధ్యయనం కూడా చెబుతోంది. మూడు లేదా ఆరు నెలలకోసారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం కూడా ఒక ప్రాక్టీస్‌గా కొనసాగించాలని సూచిస్తోంది. అంతే కాదు మీరు వాడే అన్ని ఖాతాలకు ఒకే రకమైన పాస్ వర్డ్ ను ఉపయోగించడమూ ప్రమాదకరమేనని హెచ్చరిస్తోంది.