బెంగళూరులో ఏఐ రగడ.. స్మార్ట్ బిల్ బోర్డుతో రగిలిపోతున్న వాహనదారులు.. ఏమైందంటే..?

బెంగళూరులో ఏఐ రగడ.. స్మార్ట్ బిల్ బోర్డుతో రగిలిపోతున్న వాహనదారులు.. ఏమైందంటే..?

బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఏఐ సాంకేతికను వినియోగించటం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ మానిటరింగ్ వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు అక్కడి అధికారులు. కార్స్ 24 సంస్థతో కలిసి స్మార్ట్ బిల్ బోర్డు ఏర్పాటు ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీస్తోంది. 

కొత్తగా బెంగళూరులో ఏర్పాటు చేసిన స్మార్ట్ బిల్ బోర్డు ద్వారా కెమెరాలు, వాహన్ డేటా బేస్ ఉపయోగించి ఆ దారిలో వెళుతున్న వాహనాలపై కన్నేసి ఉంచుతుంది ఏఐ. ఏదైనా వాహనం ఆ బోర్డుకు 100 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే సదరు కారు లేదా స్కూటరుకు ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నట్లయితే లేదా పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు దాటిపోతే వారి వివరాలను సెకన్లలో సదరు డిజిటల్ స్కీన్ మీద డిస్ ప్లే చేయబడుతోంది. కొందరు దీనిని ప్రజలకు బిజీ లైఫ్ లో మర్చిపోయిన అంశాలను గుర్తు చేస్తోందని అంటుంటే.. మరికొందరు మాత్రం దీనిని తప్పుపడుతున్నారు. 

బెంగళూరు నగరంలో రోడ్లు దారుణంగా గుంతలతో నిండిపోయాయని.. అయితే వాటి గురించి ఇలా ఏ రోడ్డులో ఎన్ని గుంతలు ఉన్నాయనే వివరాలు ఇలా డిజిటల్ డిస్ ప్లే చేయెుచ్చుగా.. ప్రజలను అప్రమత్తం చేయెుచ్చుగా అంటూ ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు. ప్రజలకు వారి కర్తవ్యాలను గుర్తుచేస్తున్న కర్ణాటక ప్రభుత్వం.. తాము చేయాల్సిన కర్తవ్యాలను మాత్రం మర్చిపోతోందని అంటున్నారు. అలాగే ఈ విధానాన్ని ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలపై హెచ్చరికల కోసం వాడాలి తప్ప ఇలా వాహనదారుల నంబర్లు వారి పెండింగ్ చలాన్లు పబ్లిక్ ప్లేసులో చూపటం ఏంటని మండిపడుతున్నారు. 

దీనిపై నెటిజన్లు మండిపడుతూ.. బెంగళూరులో ప్రతిచోటా రోడ్లపై గుంతల గురించి BBMP ఇంజనీర్లు, కమిషనర్లు, MLA ఇళ్లు.. కార్యాలయాల ఎదురుగా బిల్‌బోర్డ్ పెట్టగలరా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తు్న్నారు. ప్రభుత్వం ప్రజలను కుదిపేస్తోంది. బహుశా ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడానికి ఇదే ఏకైక మార్గం అంటూ మరో యూజర్ రాశారు. మరొకరు ఆ దారిలో వచ్చే అంబులెన్స్ వివరాలు పెట్టి ట్రాఫిక్ లేకుండా చూడొచ్చుగా అంటూ సలహా ఇచ్చారు. మెుత్తానికి ఏఐ వాడకం సరైనదారిలో జరగటం లేదనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి బెంగళూరు నగరంలో.