
న్యూఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సోమవారం ఢిల్లీలో డిన్నర్ ఇవ్వనున్నారు. చాణక్యపురిలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో ఈ విందు కార్యక్రమం జరగనుంది. బిహార్లో ఓటర్ల జాబితా సవరణ, పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీపై దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని ప్రతిపక్ష నేతలు ఇదివరకే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎంపీలకు విందు ఇవ్వడం ద్వారా ఐక్యతను చాటాలని ఎంపీలు భావిస్తున్నారు.
అలాగే, ఉదయం 11.30 గంటలకు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం ఆఫీసు వరకు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఓట్ల చోరీపై ఈసీ విచారణ చేయాలని కోరుతూ ఎంపీలు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ర్యాలీ జరిగిన తర్వాత ఎంపీలకు ఖర్గే డిన్నర్ ఇవ్వనున్నారు. కాగా.. రాహుల్ గాంధీ శనివారం తన నివాసంలో ఇండియా కూటమి ఎంపీలకు డిన్నర్ ఇచ్చారు.