రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర.. బీజేపీ అంతిమ లక్ష్యం ఇదే: మల్లికార్జున ఖర్గే

రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర.. బీజేపీ అంతిమ లక్ష్యం ఇదే: మల్లికార్జున ఖర్గే
  • ఎస్సీ క్రీమీలేయర్​పై సుప్రీం​ తీర్పును రద్దు చేసేందుకు
  •  పార్లమెంట్​లో చట్టం చేయాల్సింది
  • ఈ జడ్జిమెంట్ ఎస్సీలకు పెద్ద ఎదురుదెబ్బ
  • ప్రైవేట్ ​రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రావట్లేదు
  • అంటరానితనం పోనంత వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే 
  • బలహీనవర్గాల తరఫున తాము పోరాడుతామని వెల్లడి

న్యూఢిల్లీ:  కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తున్నదని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే  ఆరోపించారు. ఇప్పటికే పబ్లిక్ సెక్టార్​జాబ్స్​ను ప్రైవేటీకరించిందని అన్నారు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ప్రైవేట్​రంగంలోనూ ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రావట్లేదని తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఎస్సీలు లేరని, క్రీమీలేయర్​గా వర్గీకరించి ఎస్సీ, ఎస్టీలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. క్రీమీలేయర్​ అంశాన్ని లేవనెత్తిన సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ, ఎస్టీల గురించి సీరియస్​గా ఆలోచించలేదని చెప్పారు. 

ఎస్సీ జాబితాలోని వర్గాలను ఉప-వర్గీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఉందని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు చెప్పింది. ఎస్సీ, ఎస్టీల్లో కూడా క్రీమీలేయర్​ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల బెంచ్​లోని జస్టిస్​ గవాయ్​ సూచించారు. ఈ తీర్పుపై ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పు తనకు 
ఆశ్చర్యం కలిగిచిందని చెప్పారు.  


పార్లమెంట్​లో చట్టం చేయాల్సింది

క్రీమీలేయర్​ను సాకుగా చూపి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు నిరాకరించడం ఖండించదగినదని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసేందుకు పార్లమెంట్​లో కేంద్రం చట్టం చేసి ఉండాల్సిందని అన్నారు.  ‘‘క్రీమీలేయర్‌‌‌‌ను తీసుకురావడం ద్వారా మీరు ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నారు? క్రీమీలేయర్​తో ఎస్సీలకు రిజర్వేషన్లు దూరం చేయాలనుకుంటున్నారు. వేల ఏండ్లుగా విశేషాధికారాలు అనుభవిస్తున్న వారికి ఇస్తున్నారు. దీనిని నేను ఖండిస్తున్నా” అని పేర్కొన్నారు. 

డబ్బులు, ఉన్నతస్థానాల్లో ఉన్న కొంతమంది ఎస్సీ, ఎస్టీలు కూడా ఇంకా వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారని తెలిపారు. అంటరానితనం పూర్తిగా పోయేవరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అన్నారు. బలహీనవర్గాల తరఫున తాము పోరాడుతామని స్పష్టం చేశారు. ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన ఇతర అంశాలపై పార్టీ చర్చిస్తున్నదని, వివిధ రాష్ట్రాల మేధావులు, నేతలతో మాట్లాడి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల రక్షణకు అన్ని విధాలా కృషి చేస్తామని ఖర్గే వెల్లడించారు.