రాజ్యసభలో సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్ బలగాలా.. మన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ను ఈ స్థాయికి దిగజారుస్తారా..? ఖర్గే ఫైర్

రాజ్యసభలో సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్ బలగాలా.. మన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ను ఈ స్థాయికి దిగజారుస్తారా..? ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: రాజ్యసభలో తాము నిరసన తెలుపుతుంటే సెంట్రల్​ఇండస్ట్రియల్​సెక్యూరిటీ ఫోర్స్​(సీఎఐఎస్ఎఫ్) బలగాలు వెల్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకొచ్చాయని కాంగ్రెస్​ సభ్యులు ఆరోపించారు. ఇది తమకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందామని తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ ప్రెసిడెంట్​మల్లికార్జు ఖర్గే శుక్రవారం ఓ లేఖ రాశారు. ఈ ఘటన తీవ్ర అభ్యంతరకరమైనదని అన్నారు.  ప్రజా సమస్యలను ప్రతిపక్షం లేవనెత్తినప్పుడు ఆ బలగాలు సభలోకి ప్రవేశించకుండా చూసుకోవాలని ఆయనను కోరారు. 

‘‘రెండు రోజులనుంచి సీఐఎస్ఎఫ్​బలగాలను మనం సభలో చూస్తున్నాం.  మన పార్లమెంటు ఈ స్థాయికి దిగజారిందా..? దీనిని మేం నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం” అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తారా..? అని ఫైర్​ అయ్యారు. భవిష్యత్తులో సభ్యులు ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను లేవనెత్తినప్పుడు సీఐఎస్ఎఫ్​సిబ్బంది సభలోకి ఇక ప్రవేశించబోరని మేం ఆశిస్తున్నాం అని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా జగదీప్ దన్‌‌‌‌‌‌‌‌ఖడ్​ఆకస్మిక రాజీనామా తర్వాత రాజ్యసభను సీఐఎస్ఎఫ్ దళం స్వాధీనం చేసుకున్నట్లు అనిపిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్​ అన్నారు. ఇది దిగ్భ్రాంతికరమైన పరిణామమని పేర్కొన్నారు.

మేం ఎవరినీ అడ్డుకోలే: కేంద్ర మంత్రి కిరెన్​రిజిజు

నిరసనలు చేయకుండా తమను అడ్డుకున్నారంటూ కాంగ్రెస్​ చేస్తున్న ఆరోపణలను పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్​ కిరెన్​రిజిజు తోసిపుచ్చారు. సభలో మాట్లాడకుండా ఎవరినీ అడ్డుకోలేదని, రాజ్యసభకు కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయని స్పష్టం చేశారు. రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కొంతమంది ఎంపీలు దూకుడుగా వ్యవహరిస్తే మార్షల్స్ వారిని అడ్డుకున్నారని చెప్పారు. ‘‘రాజ్యసభలో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఏ పార్లమెంటేరియన్‌‌‌‌‌‌‌‌ను మాట్లాడకుండా అడ్డుకోలేదు. 

రాజ్యసభలో నిర్దేశించిన సరిహద్దును ఎవరైనా దాటితే తగిన చర్యలు తీసుకుంటామని సీఐఎస్ఎఫ్ ద్వారా వెల్లడించాం” అని చెప్పారు. గతంలో జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు చైర్మన్​చాంబర్‌‌‌‌‌‌‌‌లోకి దూకి టియర్​ గ్యాస్​ వదిలారని, ఆ సంఘటన తర్వాత  2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్లమెంట్​సమగ్ర భద్రతను సీఐఎస్ఎఫ్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. అసలు సభలో ఏమి జరిగిందో కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నానని కిరెన్ ​రిజిజు తెలిపారు.

ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిరసనలు లోక్​సభ వాయిదా

బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్​)కు వ్యతిరేకంగా లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. దీంతో సభ శుక్రవారం రోజంతా వాయిదా పడుతూనే వచ్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకొని నిల్చొని నిరసన తెలిపారు స్పీకర్​ ఓంబిర్లా చెప్పినా వినలేదు.  దీంతో స్పీకర్​ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు సీట్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును చేపట్టాలని చైర్ చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీంతో షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలకు ప్రతిపక్షం వ్యతిరేకంగా ఉందా? అంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్​ ప్రశ్నించారు.