
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కుల గణన సక్సెస్ గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా విజయోత్సవ సభ నిర్వహించాలని ఏఐసీసీ ప్లాన్ చేస్తున్నది. కుల గణన ప్రకటనలో కీలక పాత్ర పోషించిన రాహుల్ గాంధీకి త్వరలో ఢిల్లీ వేదికగా ధన్యవాద సభ, భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ (ఐఐసీ) లో కాంగ్రెస్ ఓబీసీ సెల్ నేతృత్వంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు జరిగింది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఓబీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ సీఎంలు, పీసీసీలు, పార్టీ ముఖ్య నేతలతోపాటు తెలంగాణ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, కొండా సురేఖ, ఎంపీలు, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, వీహెచ్, మధుయాష్కీ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఢిల్లీ కేంద్రంగా కుల గణన ప్రచారాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలని ఇందులో నిర్ణయించారు.
పొన్నం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సదస్సులో తొలుత ‘రాహుల్ అభినందన సభ’, ర్యాలీపై చర్చించారు. కుల గణన సక్సెస్ దేశ వ్యాప్త ప్రచారంపై సమాలోచనలు చేశారు. అనంతరం కుల గణన పై మంత్రి పొన్న ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుల గణన లో చేపట్టిన అంశాలను పాయింట్ వైజ్ గా వివరించారు. అలాగే పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్ కుల గణన పై మాట్లాడారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు బీసీ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా కుల గణన చేసి చూపారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్, ఉద్యమ నేతలు, బీసీ నేతలతో మరో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఓబీసీ సెల్ నిర్వహించింది.