
హైదరాబాద్, వెలుగు: డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ అబ్జర్వర్లు అక్టోబర్ 4న రాష్ట్రానికి రానున్నారు. 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, 35 జిల్లాలకు అర్హులైన కాంగ్రెస్ అధ్యక్షుల పేర్లను హైకమాండ్‌కు సిఫార్సు చేయనున్నారు. డీసీసీ చీఫ్‌ల నియామక ప్రక్రియ నేరుగా ఏఐసీసీ చేపట్టనుండటంతో రెండ్రోలకిందే 22 మంది అబ్జర్వర్లను హైకమాండ్ నియమించింది.
తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేయనున్న అబ్జర్వర్లందరికీ నియామకాలకు సంబంధించిన నిబంధనలను వివరించేందుకు గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ప్రత్యేక భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గోనున్నారు. మన రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు.