కొవిడ్ మరణాలపై రాష్ట్ర సర్కార్ దొంగ లెక్కలు

కొవిడ్ మరణాలపై రాష్ట్ర సర్కార్ దొంగ లెక్కలు

హైదరాబాద్: కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని శ్రవణ్ గుర్తు చేశారు. న్యాయస్థానాల వల్ల కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు నిద్రలేస్తున్నాయని చెప్పారు. కరోనా బారిన పడి దేశంలో చాలా మంది చనిపోయారని, మన రాష్ట్రంలో కూడా కొవిడ్ డెత్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3,640 మంది మాత్రమే చనిపోయినట్లు నమోదు చేసిందన్నారు.

‘కరోనాతో గ్రేటర్ హైదరాబాద్‌‌‌లో గతేడాది 76,371మంది చనిపోతే.. ఈ సంవత్సరం జనవరి నుంచి నిన్నటి వరకు 47,472 మంది ప్రజలు చనిపోయారు. ఇది జీహెచ్‌ఎంసీలో డెత్ సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య. గత మూడేళ్లుగా యావరేజ్ డెత్ రేషియో తీసుకుంటే.. కొవిడ్ వల్ల గ్రేటర్‌‌లో చనిపోయిన వాళ్లు 50 వేల మంది. సీఎం కేసీఆర్ కరోనా డెత్ కేసుల విషయంలో దొంగ లెక్కలు చెబుతున్నారు. కేంద్రం గైడ్‌‌లైన్స్ రిలీజ్ చేస్తే.. సెంట్రల్ నుంచి వచ్చే నిధులు కూడా రావు. ఐసీఎంఆర్ గైడ్‌‌లైన్స్ కూడా పట్టించుకోకుండా కేసీఆర్ సర్కార్ దొంగ లెక్కలు నమోదు చేసింది. దొంగ లెక్కలు నమోదు చేసిన వారితోపాటు ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కరోనా వల్ల రైతులు కూడా చనిపోయారు. అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం కింద చనిపోయిన కుటుంబాలకు  రూ.5 లక్షల వరకు ఇవ్వొచ్చు. ఈ విషయం గురించి సరైన అవగాహన లేక చాలా మంది దీన్ని స్వద్వినియోగం చేసుకోలేకపోతున్నారు’ అని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.