WTC ఫైనల్‎లో వీరోచిత సెంచరీ.. ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మాన్ సరసన చేరిన మార్క్రమ్

WTC ఫైనల్‎లో వీరోచిత సెంచరీ.. ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మాన్ సరసన చేరిన మార్క్రమ్

లండన్: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ వీరోచిత సెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని సెంచరీ బాదిన మార్క్రమ్ సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.  ఫస్ట్ ఇన్సింగ్స్‎లో డకౌట్ అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా పట్టుదలగా ఆడి సెకండ్స్ ఇన్సింగ్స్‎లో సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ చారిత్రాత్మక సెంచరీతో మార్క్రమ్ మరో అరుదైన ఘనత సాధించాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగిన ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో నాలుగో ఇన్సింగ్స్‎లో సెంచరీ బాదిన ఆరవ ప్లేయర్‎గా మార్క్రమ్ చరిత్ర సృష్టించాడు. దీంతో లార్డ్స్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన క్రికెటర్ల ఎలైట్ జాబితాలో చేరాడు సెంచరీ హీరో. మార్క్రమ్ కంటే ముందు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్ మాన్, గోర్డాన్ గ్రీనిడ్జ్, మైఖేల్ క్లార్క్, అజిత్ అగార్కర్ వంటి ప్లేయర్లు లార్డ్స్‎లో నాల్గో ఇన్సింగ్స్‎లో సెంచరీ బాదారు. డబ్ల్యూటీసీ ఫైనల్‎లో సాధించిన సూపర్ సెంచరీతో మార్క్రమ్ వీరి సరసన చేరాడు. 

కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-2025 విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా శనివారం (జూన్ 14) ఆస్ట్రేలియాతో ముగిసిన  ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగో రోజు సౌతాఫ్రికా విజయానికి 69 పరుగులు అవసరం కాగా.. డేవిడ్ బెడింగ్‌హామ్ (21) సహకారంతో సెంచరీ హీరో ఓపెనర్ మార్కరం (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

బవుమా (66), స్టబ్స్ (8) నాలుగో రోజు త్వరగా ఔటైనా ఒత్తిడి తట్టుకొని మార్కరం, బెడింగ్‌హామ్ (21) కీలక భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్ ఆశలపై నీళ్లు చల్లారు. సౌతాఫ్రికా టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాదు 27 ఏళ్ళ తర్వాత సఫారీ జట్టు ఐసీసీ టైటిల్ గెలిచింది. చివరిసారిగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ గెలిచింది. తాజాగా డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న సౌతాఫ్రికా 27 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.