‘కుష్టు’ మందు కరోనాకు వాడొచ్చట!

‘కుష్టు’ మందు కరోనాకు వాడొచ్చట!
  • ‘మైకోబ్యాక్టిరియమ్ డబ్ల్యూ’తో కోలుకున్న కరోనా పేషెంట్లు
  • భోపాల్ ఎయిమ్స్ లో కొనసాగుతున్న ట్రయల్స్
  • కెనడాలో ఇంటర్ ఫెరాన్ కూడా సక్సెస్
  • బ్రిటన్ లో కరోనాను గుర్తించే ‘కొవిడ్ డాగ్స్’కు ట్రెయినింగ్

కరోనాపై పోరులో ‘మైకోబ్యాక్టిరియమ్ డబ్ల్యూ’ అనే మందు కూడా బాగానే పని చేస్తున్నట్లు భోపాల్ ఎయిమ్స్ డాక్టర్లు వెల్లడించారు. తాము నలుగురు కరోనా పేషెంట్లకు ఈ మందుతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, ముగ్గురు పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ శనివారం ప్రకటించారు. అయితే, ట్రయల్స్ పూర్తయిన తర్వాతే ఈ మందు పూర్తిగా సురక్షితం, ఎఫెక్టివ్ గా పనిచేస్తుందా? లేదా? అన్నది డిసైడ్ అవుతుందన్నారు. జపాన్ లో కొవిడ్ పేషెంట్లకు వాడిన ఫావిపిరావిర్ మందునూ తాము టెస్ట్ చేస్తామని తెలిపారు. మైకోబ్యాక్టిరియమ్ డబ్ల్యూ మందును ప్రస్తుతం కుష్టు రోగుల ట్రీట్ మెంట్ కు ఉపయోగిస్తున్నారు. దీనిని సీరియస్ గా ఉన్న కొవిడ్ పేషెంట్లకు వాడేందుకు భోపాల్ ఎయిమ్స్ తో పాటు మరో రెండు హాస్పిటళ్లకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్​ఇండియా ఇటీవల పర్మిషన్ ఇచ్చింది.

ఇంటర్ ఫెరాన్ కూడా..

కరోనా వైరస్ రోగులు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడే మరో యాంటీవైరల్ డ్రగ్ ను కెనడా సైంటిస్టులు గుర్తించారు. ‘ఇంటర్ ఫెరాన్ (ఐఎఫ్ఎన్)–ఏ2బీ’ అనే యాంటీవైరల్ డ్రగ్ తో కొవిడ్ పేషెంట్లు వేగంగా కోలుకుంటున్నారని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్​టొరాంటో సైంటిస్టులు వెల్లడించారు. దీనిని చాలా ఏళ్ల నుంచి యాంటీవైరల్ మందుగా ఉపయోగిస్తున్నారు. రీసెర్చ్ లో భాగంగా కరోనా పేషెంట్లకు ఈ మందును ఇవ్వగా, ఏడు రోజుల్లోనే వారిలో వైరస్ లోడ్ ను గణనీయంగా తగ్గించినట్లు తేలింది. పేషెంట్లలో వైరల్ ఇన్ఫెక్షన్ కు వ్యతిరేకంగా పోరాడుతూ వాపును కలిగించే ఇంటర్ ల్యూకిన్–6, సీ–రియాక్టివ్ ప్రొటీన్ లను కూడా ఈ మందు తగ్గిస్తుందని సైంటిస్టులు గుర్తించారు. ప్రతి కొత్త వైరస్ కు ప్రత్యేక మందులు తయారు చేసే బదులు అన్నింటికీ, ఇంటర్ ఫెరాన్ ను వాడొచ్చని స్టడీ లీడ్ ఆథర్ ఎలీనార్ ఫిష్​సూచించారు. ఈ స్టడీ వివరాలు ఇటీవల ‘ ఫ్రంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీ’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.

‘కొవిడ్ డాగ్స్’కు ట్రెయినింగ్..

వాసన చూసి కరోనా వైరస్ సోకిందా? లేదా? అన్నది గుర్తించేందుకు కుక్కలు త్వరలో రంగంలోకి దిగనున్నాయి. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో లక్షణాలు బయటకపడకముందే వాసనతో వైరస్ ను పసిగట్టగలిగే ప్రత్యేక ‘కొవిడ్ డాగ్స్’ బ్రిటన్ లో ఇప్పుడు ట్రెయినింగ్ పొందుతున్నాయి. మెడికల్ డిటెక్షన్ డాగ్స్, డర్హామ్ యూనివర్సిటీలతో కలిసి లండన్ స్కూల్ ఆఫ్​హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (ఎస్ఎస్ హెచ్ టీఎం) సంస్థ లాబ్రడార్, కాకర్ స్పానియల్స్ జాతి కుక్కలతో ఈ రీసెర్చ్ ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం మొదటి దశ రీసెర్చ్ జరుగుతోంది. ఇందులో కుక్కలు కొవిడ్-19 వాసనను గుర్తించగలిగితే, రెండో దశ రీసెర్చ్ మొదలుపెడతారు. అప్పుడు లైవ్ సిచుయేషన్స్ లో వీటిని పరీక్షించనున్నారు. కుక్కలు వాసన ద్వారా మనుషుల్లో కేన్సర్, మలేరియా, పార్కిన్సన్స్ రోగాలను గుర్తించగలవని ఇప్పటికే పలు రీసెర్చ్ లలో తేలింది. కరోనాను కూడా ఇవి గుర్తించగలిగితే టెస్టింగ్ స్ట్రాటజీ వేగవంతం అవుతుందని, ఫలితాలు మరింత స్పీడ్ గా, కచ్చితత్వంతో వస్తాయని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత రీసెర్చ్ పూర్తయిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టే.. ఈ కుక్కలను కరోనా వైరస్ ను గుర్తించే కొవిడ్ డాగ్స్ గా ఉపయోగించాలా? వద్దా? అన్నది తేలనుంది.

ఇండ్లలో శానిటైజేషన్ కు సీఎస్ఐఆర్ స్ప్రేయర్లు

ఇండ్లు, హాస్పిటళ్లలో రూంలు, వరండాలు, బెడ్లు, వార్డులు, వస్తువులను శానిటైజేషన్ చేసేందుకు ఉపయోగపడే రెండు ప్రత్యేక స్ప్రేయర్లను పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లోని సీఎస్ఐఆర్– సీఎంఈఆర్ఐ సైంటిస్టులు తయారు చేశారు. ‘బ్యాటరీ పవర్డ్ డిస్ ఇన్ఫెక్టెంట్ స్ప్రేయర్ (బీపీడీఎస్)’, ‘నుమాటికల్లీ ఆపరేటెడ్ మొబైల్ ఇండోర్ డిస్ ఇన్ఫెక్షన్ యూనిట్ (పీవోఎంఐడీ)’ అనే ఈ రెండు స్ప్రేయర్ యూనిట్లలో స్ప్రేయింగ్, స్టోరేజ్ ట్యాంకు ఉంటాయి. ప్రస్తుత స్ర్పేయర్లలో సింగిల్ చాంబర్ స్టోరేజీ ఉంటుందని, కానీ వీటిలో డ్యూయల్ చాంబర్ స్టోరేజీ ఉండటం వల్ల అటు క్లీనింగ్ కు ఇటు డిస్ ఇన్ఫెక్షన్ కు రెండు రకాలుగానూ ఉపయోగపడుతుందని సైంటిస్టులు తెలిపారు.