
- రాష్ట్రంలో 384 మంది తల్లులు, ఐదేండ్లలోపు పిల్లలపై అధ్యయనం
- మిల్లెట్స్ తీసుకునే పిల్లలతో పోలిస్తే.. తీసుకోని పిల్లల్లో పోషకాహారలోపం గుర్తింపు
- మిల్లెట్ ఫుడ్ తినే వారిలో ఎత్తుకు తగ్గ బరువు, శారీరక, మానసిక ఆరోగ్యం
హైదరాబాద్, వెలుగు : చిరు ధాన్యాలను (మిల్లెట్స్) ఆహారంగా తీసుకుంటున్న చిన్నారులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగా, వాటిని తీసుకోని వారు పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది. చిన్నారుల ఆరోగ్యంపై చిరుధాన్యాల ప్రభావం తెలుసుకునేందుకు ‘మిల్లెట్స్ ఫర్ లిటిల్ వన్స్’ పేరుతో యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్.. తల్లులు, పిల్లలపై క్రాస్ సెక్షనల్ స్టడీ చేసింది.
చిన్నారుల ఎదుగుదలలో చిరుధాన్యాలే కీలకపాత్ర పోషిస్తున్నాయని, మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటున్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారని తేల్చింది. చిరుధాన్యాలు తీసుకోని పిల్లలతో పోలిస్తే.. వాటిని తినే పిల్లల్లో ఎత్తు, బరువు పర్ఫెక్ట్‌గా ఉన్నాయని స్టడీ స్పష్టం చేసింది. ఈ స్టడీ వివరాలు ఇటీవలే ‘ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్’ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.
పిల్లల ఎదుగుదలపై మిల్లెట్స్ ప్రభావం
ఎయిమ్స్ పరిశోధకులు రాష్ట్రంలోని 384 మంది తల్లులు, వారి ఐదేండ్లలోపు పిల్లలపై స్టడీని నిర్వహించారు. 99 శాతం మంది తల్లులకు జొన్న, రాగి, సజ్జల వంటి చిరుధాన్యాలపై అవగాహన ఉన్నప్పటికీ.. కేవలం 60 శాతం మంది మాత్రమే వారానికి రెండు మూడు సార్లు తమ పిల్లల ఆహారంలో మిల్లెట్స్ చేరుస్తున్నారు. అంటే 40 శాతం మంది పిల్లలకు మిల్లెట్స్ ఫుడ్ అందడం లేదని స్టడీలో గుర్తించారు. పిల్లలకు మిల్లెట్స్ ఎందుకు పెట్టడం లేదని తల్లులను ప్రశ్నించగా.. ‘పిల్ల ల ఆహారంలో ఎలా వాడాలో తెలియకపోవడం, అవి అరగవేమోనన్న అపోహ, వాటి రుచి పిల్లలు ఇష్టపడకపోవడం’ వంటి కారణాలు వెల్లడించారు.
పిల్లలకు మిల్లెట్ ఫుడ్ ఇచ్చే వారిలో రాగులు, జొన్నలు, సజ్జలను ఎక్కువగా వాడుతున్నట్లు తెలిపారు. మిల్లెట్స్ తినే పిల్ల లు, తినని పిల్లల మధ్య చాలా తేడాలు ఉన్నట్లు స్టడీలో గుర్తించారు. మిల్లెట్స్ తినే పిల్లల్లో శారీరక ఎదుగుదల, సగటు ఎత్తు, బరువు, మధ్య-చేతి పైభాగం చుట్టుకొలత.. మిల్లెట్స్ తినని పిల్లల కంటే ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. మిల్లెట్స్ తినే పిల్లలో పోషకాహార లోపాలు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ స్టడీ వివరాలు పిల్లల ఎదుగుదలలో మిల్లెట్స్ అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్యాకెట్ ఫుడ్స్.. పేరుకే మిల్లెట్స్
స్టడీలో భాగంగా పరిశోధకులు మార్కెట్‌లో దొరికే రెడీ -టు ఈట్, రెడీ టు కుక్ మిల్లెట్ ప్రొడక్ట్‌లపై కూడా విశ్లేషణ చేశారు. ఈ మిల్లెట్ ఫుడ్స్‌లో చాలా ప్రొడక్ట్‌లు పిల్లలకు అవసరమైన ఎనర్జీ, ప్రొటీన్లు, ఐరన్‌ను అందిస్తున్నప్పటికీ, కాల్షియం చాలా తక్కువ మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా.. కొన్ని రెడీ టు కుక్ ప్రొడక్ట్స్‌లో సాల్ట్ (సోడియం) ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
50 శాతాగానికి పైగా ప్రొడక్స్‌లో ప్యాకెట్లపై అది ఏ వయసు పిల్లలకు సరిపోతుందో తెలియజేసే లేబులింగ్ సరిగ్గా లేదని తేలింది. అలాగే అలర్జీ కారకాలు, సరైన స్టోరేజ్ మెథడ్స్, ఇన్‌గ్రీడియన్స్ వివరాలు చాలా ప్యాకెట్లపై స్పష్టంగా లేవని పేర్కొన్నారు. ప్యాక్‌లపై ఇన్‌ఫర్మేషన్ ఇంగ్లీష్‌లోనే ఉండడం, తెలుగులో లేకపోవడం కూడా ఓ సమస్యగా గుర్తించారు.
అవగాహన కల్పించాలంటున్న నిపుణులు
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు ఎంతగానో దోహదపడతాయని ఎయిమ్స్ అధ్యయనం మరోసారి నిరూపించిందని పరిశోధకులు తెలిపారు. తల్లుల్లో ఉన్న అపోహలను తొలగించి, పిల్లల ఆహారంలో చిరుధాన్యాలను ఎలా చేర్చాలో అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం సైతం అంగన్‌వాడీల ద్వారా అందించే పౌష్టికాహారంలో చిరుధాన్యాలను చేరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
అదే సమయంలో, ప్యాకేజ్డ్ మిల్లెట్ ఫుడ్ సంస్థలు లేబుళ్లపై వయసు, పోషకాలు, అలర్జీల గురించి స్పష్టమైన, పూర్తి సమాచారాన్ని స్థానిక భాషలో కూడా అందించేలా ఫుడ్ సేఫ్టీ అండ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కఠినం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.