
న్యూఢిల్లీ: బార్డర్లో చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో మన ఎయిర్‌ఫోర్స్ అలర్ట్ అయ్యింది. ఈశాన్య భారతంలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద భారీ విన్యాసాలకు సిద్ధమైంది. ఇక్కడి ప్రధాన ఎయిర్ బేస్‌లన్నీ ఈ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయని అధికారులు వెల్లడించారు. వచ్చే నెల మొదట్లో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుందన్నారు. అలాగే 400 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను, మిస్సైల్స్‌ను గుర్తించే సామర్థ్యం కలిగిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రాన్‌ను కూడా ఇప్పుడు పరీక్షించనున్నారు. విన్యాసాల్లో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించి యుద్ధ సమయాల్లో ఉపయోగపడే రాఫెల్, సుఖోయ్ సు–30 ఫైటర్లతో పాటు ట్రాన్స్పోర్ట్, ఇతర విమానాలను టెస్ట్ చేస్తారు.
డ్రోన్ స్క్వాడ్రాన్కూడా ఇందులో పాలుపంచుకుంటుందని అధికారులు తెలిపారు. సిక్కిం, సిలిగురి సెక్టార్లో శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు ఈ స్క్వాడ్రాన్ ఉపయోగపడుతుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఎక్సర్‌సైజ్‌లను మనదేశం నిర్వహించడం ఇది రెండోసారి. చైనా ఇటీవల కాలంలో సరిహద్దుల వద్ద సైన్యాన్ని భారీగా పెంచింది. డోక్లాం వద్ద యాక్టివిటీస్‌ను పెంచింది. ఇక్కడ చైనా కదలికలపై మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. షిల్లాంగ్‌లోని ఐఏఎఫ్ఈస్టర్న్ కమాండ్ ఈశాన్యంలోని చైనా సరిహద్దు వెంబడి గగనతలాన్ని పరిరక్షిస్తుంది. చైనా ఫ్లైట్లు, ఫైటర్ జెట్లు ఎల్ఏసీకి దగ్గరగా రావడానికి ప్రయత్నించినా.. లేదా అక్కడి ఇండియన్ క్యాంపుల దిశలో వెళ్లడానికి యత్నించినా తన ఫైటర్లు తరచు అడ్డుకుంటున్నారు.