వెండితెర అదృష్టతార కాంచన

వెండితెర అదృష్టతార కాంచన

ఆమె ఒక ఎయిర్ హోస్టెస్. తన డ్యూటీ తాను చేసుకుంటోంది. ఆమె డ్యూటీలో ఉన్న విమానంలోనే ప్రముఖ తమిళ దర్శక, నిర్మాత సీవీ శ్రీధర్ ఉన్నారు. ఆమె హైటు .. పర్సనాలిటీ .. ముక్కు తీరు.. కళ్లలోని మెరుపును ఆయన చూశారు. వెంటనే ఆ ఎయిర్ హోస్టెస్ ను పిలిచి.. మీరు సినిమాలో హీరోయిన్ గా చేస్తారా ? అని అడిగారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆ యువతి.. ఒక్క సెకను కూడా ఆలోచించకుండా సరేనని చెప్పింది. సినిమాలపై ఆమెకున్న ఇష్టం వల్ల ఇలా చటుక్కున బదులిచ్చింది. అలా 1970వ దశకంలో తమిళ సినిమా ‘కాదలిక్క నేరమిల్లై’ తో హీరోయిన్ గా పరిచయమైంది కాంచన. అలనాటి సూపర్ స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. వాస్తవానికి అది ఆమె తొలి సినిమా కాదు. 18 ఏళ్ల వయసులో ఉండగా.. 1957 సంవత్సరంలోనే ‘సువర్ణసుందరి’ సినిమాలో కాంచన నటించారు. అందులో నాగకన్యగా చిన్న పాత్ర వేశారు. 

ఈతరం వాళ్లకు అర్ధమయ్యేలా..

ఈ తరం వాళ్లకు కాంచన గురించి చెప్పాలంటే.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను గుర్తు చేయాలి. ఆ మూవీలో హీరో విజయ్ దేవరకొండ బామ్మ పాత్రలో నటించింది మరెవరో కాదు.. కాంచనే!! సినిమా ఇండస్ట్రీలో 30 ఏళ్ల గ్యాప్ తర్వాత కాంచన నటించిన మూవీ అది. ఇందులో సినిమాటిక్ బామ్మలా కాకుండా మోడ్రన్ బామ్మలా కాంచనను చూపించారు. సాధారణంగా మనవలు ఏదైనా తప్పు చేస్తే.. నానమ్మలు బాధపడడమో, తిట్టడమో చేస్తారు. కానీ అర్జున్ రెడ్డి సినిమాలో పాత్రలో నటించిన కాంచన.. పాతికేళ్ల కుర్రాడు ఏ పరిస్థితుల్లో అలా చేశాడనేది అర్థం చేసుకుంటుంది. 

కాంచన నేపథ్యం.. 

కాంచన అసలు పేరు ‘పురాణం వసుంధరాదేవి’. ప్రకాశం జిల్లా ‘కరవది’ గ్రామంలో 1939 ఆగస్టు 16న జన్మించారు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే, మరో వైపున సంగీతం .. భరతనాట్యం నేర్చుకున్నారు. అప్పట్లోనే కాంచన చాలా స్టైలిష్ గా ఉండే కాంచన ఎయిర్ హోస్టెస్ గా వర్క్ చేశారు. హోస్టెస్ గా పనిచేస్తున్న కాంచనను తమిళ దర్శక నిర్మాత సీవీ శ్రీధర్ చూసి సినిమా అవకాశం ఇచ్చారు. అలా తమిళంలో ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కాంచన.. తొలి సినిమాతోనే హిట్ కొట్టారు. ఆ తరువాత అదే సినిమాను తెలుగులో ‘ప్రేమించు చూడు’ టైటిల్ తో నిర్మించగా, అందులోనూ ఆమె హీరోయిన్ గా  నటించారు. అదే ఏడాది అక్కినేనితో చేసిన ‘ఆత్మ గౌరవం’ ,  శోభన్ బాబు జోడిగా చేసిన ‘వీరాభిమన్యు’ సినిమాలతో ఆమె కెరీర్ స్పీడ్ అందుకుంది. అప్పటికే సావిత్రి, జమున, కృష్ణకుమారి తదితర హీరోయిన్లు రేసులో ఉండటంతో తన ప్రత్యేకతను నిలుపుకోవడం కోసం గ్లామరస్ గా, మోడ్రన్ గా కనిపించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. ఆ కొత్తదనమే అభిమానులు ఇష్టపడటానికి కారణమైంది. చాలా భాషలు తెలిసి ఉండటంతో తక్కువ సమయంలోనే ఆమె తమిళ, మలయాళ, కన్నడ,  హిందీ సినిమాల్లోను అవకాశాలు దక్కించుకున్నారు. 

ఏఎన్నార్ తో ఎక్కువ సినిమాలు

తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో కాంచన సినిమాలు చేశారు. అక్కినేనితో అందరి కన్నా ఎక్కువ సినిమాలు చేశారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ లతో, కన్నడలో రాజ్ కుమార్ తో కలిసి నటించారు. శోభన్ బాబుతో చేసిన ‘వీరాభిమన్యు’, ‘కల్యాణ మంటపం’ సినిమాలు కాంచన కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచాయి. కల్యాణ మంటపం’ సినిమాలోని చంద్రముఖి పాత్ర ఆమె నటనకు కొలమానంగా నిలుస్తుంది. ఇక ‘అవేకళ్లు’ సినిమాలో మోడ్రన్ డ్రెస్ లతో .. ఆమె చేసిన మోడ్రన్ డాన్సులు అప్పట్లో యూత్కి విపరీతంగా నచ్చాయి. 

భక్తిభావం ఎక్కువ

కాంచన కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, కుటుంబ సభ్యుల కారణంగా ఆమె మనసు గాయపడిందని చెబుతారు. తనవారే తనని మోసం చేయడంతో ఒక రకమైన విరక్తి భావానికి కాంచన లోనయ్యారు. అందువల్లనే ఇటు సినిమాలకి .. అటు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకి దూరమయ్యారు. కాంచన పైకి చాలా మోడ్రన్ గా కనిపించినప్పటికీ, ఆమెలో ఆధ్యాత్మిక భావాలు మొదటి నుంచి ఎక్కువే. ఆలయాలకు వెళ్లి పూజల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మిక భావాలతో బెంగుళూరు సమీపంలో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు.