కేజీన్నర బంగారం చేతులకు చుట్టుకుని వచ్చాడ...  కస్టమ్స్‌కు చిక్కాడు

కేజీన్నర బంగారం చేతులకు చుట్టుకుని వచ్చాడ...  కస్టమ్స్‌కు చిక్కాడు

Air India Express- smuggling : ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express)కు చెందిన ఓ ఉద్యోగి దాపు కేజీన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ బంగారాన్ని తన చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్‌ (smuggling) చేసేందుకు ప్రయత్నించగా.. అధికారులు అతడిని పట్టుకున్నారు. కేరళలోని కొచ్చిన్‌ (Cochin) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన బయటపడింది.

బహ్రెయిన్‌ నుంచి కోజికోడ్‌ మీదుగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానం కోచి ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆ విమానంలో కేబిన్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న షఫీ అనే వ్యక్తి.. గోల్డ్ ను స్మగ్లింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కస్టమ్స్‌ ప్రివెంటివ్‌ కమిషనరేట్‌కు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్‌ అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ అయిన తర్వాత గ్రీన్‌ ఛానల్‌ నుంచి హడావుడిగా వెళ్తున్న షఫీని పట్టుకోగా.. ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం బయటపడింది. పేస్ట్‌ రూపంలో ఉన్న 1487 గ్రాముల బంగారాన్ని షఫీ తన రెండు చేతులకు చుట్టుకున్నాడు. అది బయటకు కనిపించకుండా స్లీవ్స్‌ను కప్పి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆ బంగారం విలువ దాదాపు రూ.75 లక్షలు ఉంటుందని చెప్పారు. షఫీని సస్పెండ్ చేస్తున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వెల్లడించింది.