అహ్మదాబాద్‌‌‌‌ ఫ్లైట్ క్రాష్కు పైలటే కారణమా?

అహ్మదాబాద్‌‌‌‌ ఫ్లైట్ క్రాష్కు పైలటే కారణమా?
  •  
  • ఇద్దరిలో ఒకరికి మెడికల్​ హిస్టరీ 
  • లాంగ్ ​లీవ్‌‌ తర్వాత విధుల్లోకి..
  • ఇది సూసైడ్​ ప్రయత్నంలా కనిపిస్తున్నదని ఏవియేషన్​ సేఫ్టీ ఎక్స్‌‌పర్ట్​ సందేహం

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ బ్యూరో (ఏఏఐబీ) ప్రిలిమినరీ రిపోర్ట్​ బహిర్గతమైన విషయం తెలిసిందే. ఇందులో విమాన ఇంజిన్ల ఫ్యుయెల్​ కంట్రోల్‌‌‌‌ స్విచ్‌‌‌‌లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విమానంలోని ఇంజిన్ల ఇంధన స్విచ్‌‌‌‌లు రన్‌‌‌‌ నుంచి కటాఫ్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి మారడమే ఇందుకు కారణమని రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇది పైలట్ల పాత్రపై అనుమానాలు రేకెత్తించగా..  దీనికి బలాన్ని చేకూరుస్తూ ఏవియేషన్​ సేఫ్టీ ఎక్స్​పర్ట్​ కెప్టెన్​ మోహన్ రంగనాథన్  పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ  ఎయిరిండియా ప్లేన్​ క్రాష్.. పైలెట్ ​సూసైడ్​ యత్నంలా కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. పైలట్లలో ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఇంధనాన్ని ఆపివేయడం వల్లే  ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

అది మాన్యువల్​గానే చేయాలి 

విమానంలో ఫ్యుయెల్​ కంట్రోల్​ స్విచ్​లను మాన్యువల్​గానే ఆఫ్​ చేయాల్సి ఉంటుందని మోహన్ రంగనాథన్  తెలిపారు. ఈ స్విచ్‌‌‌‌లు ఆటోమేటిక్‌‌‌‌గా, విద్యుత్​ వైఫల్యం కారణంగా.. రన్​ నుంచి కటాఫ్​కు, కటాఫ్ నుంచి రన్​కు మారే అవకాశమే లేదని అన్నారు. ఫ్యూయెల్ ​సెలెక్టర్లు స్లైడింగ్ రకం కాదని.. అవి స్లాట్‌‌‌‌లో ఉండేలా రూపొందించడం వల్ల  వాటిని పైకి లేదా కిందికి మార్చాలంటే తొలుత ముందుకు లాగాల్సి ఉంటుందని చెప్పారు. అంటే మానవ ప్రయత్నం లేకుండా స్విచ్​లను మార్చేందుకు వీలులేదని తెలిపారు.  అలాగే, విమానం నడిపే ఓ పైలట్​కు మెడికల్ హిస్టరీ ఉన్నట్టు తనకు తెలిసిందని చెప్పారు. విమానం టేకాఫ్​కాగానే.. రెండు స్విచ్​లు ఒకదాని వెనుక ఒకటి ఆఫ్​ అయ్యాయని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని అన్నారు. కాక్‌‌‌‌పిట్ వాయిస్ రికార్డింగ్‌‌‌‌ ప్రకారం.. ఒక పైలట్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారని అడిగాడని, మరొక పైలట్ తాను అలా చేయలేదని బదులిచ్చినట్టు వెల్లడించారని, కానీ ఇది ఎందుకు జరిగిందో రిపోర్ట్‌‌‌‌లో అస్పష్టంగానే ఉన్నదని రంగనాథన్​ అన్నారు. విమానం టేకాఫ్​ సమయంలో  ఫస్ట్​ ఆఫీసర్​ క్లైవ్​ కుందర్​ చేతులు కంట్రోల్​ కాలమ్​పై ఉన్నాయని, ఆ సమయంలో కెప్టెన్​ సుమీత్​ సభర్వాల్​ ఖాళీగా ఉన్నారని.. ఇందులో ఈ పాయింటే చాలా కీలకమని తెలిపారు. ‘‘"కెప్టెన్ పైలట్ పర్యవేక్షణలో ఉన్నారని, కో-పైలట్ విమానాన్ని నడుపుతున్నారని   నివేదిక స్పష్టం చేసింది. అంటే కో పైలట్ చేతులు రెండూ కంట్రోల్ కాలమ్‌‌‌‌పై ఉంటాయి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ కాదు. వారు విమానాన్ని తిప్పడం, ఆటోపైలట్‌‌‌‌ను సెట్ చేయడంపై దృష్టి పెడతారు. పైలట్ పర్యవేక్షణ మాత్రమే చేస్తారు” అని వివరించారు. అలాగే, కెప్టెన్​కు మెడికల్ కండిషన్​ సరిగా లేక మెడికల్​ లీవ్​లో ఉన్నట్టు ఎయిర్​ ఇండియాలోని చాలా మంది పైలట్లు చెప్పారని రంగనాథన్​ తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యం, మానసిక ప్రవర్తనపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు.