విదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొవిడ్ మార్గదర్శకాలు

విదేశీ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా కొవిడ్ మార్గదర్శకాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్కు వచ్చే విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా కరోనా మార్గదర్శకాలను విడుదల చేసింది. యూఏఈ నుంచి భారత్కు ఎయిర్ ఇండియాలో వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆయా దేశాలు ఆమోదించబడిన టీకాలు వేయించుకున్నట్లు రిపోర్టులు చూపించాలని స్పష్టం చేసింది. అలాగే మాస్క్‌లను ధరించాలని స్పష్టం చేసింది. విమానాల్లో భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోస్ట్ -అరైవల్ కరోనా పరీక్ష అవసరం లేదని పేర్కొంది. అయితే పిల్లలు వచ్చిన తర్వాత వారిలో COVID-19 లక్షణాలు కనిపిస్తే మాత్రం పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని సూచించింది. అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం ఎయిర్ పోర్టుల్లో  కరోనా పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. ఎయిర్ ఇండియా తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. 

చైనాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారి నమూనాలను ఎయిర్ పోర్టుల్లో సేకరించి  కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నందున చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు కేంద్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులెవరికైనా పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలితే వారిని క్వారంటైన్‌లో ఉంచుతారు.చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకులకు కూడా ప్రస్తుత ఆరోగ్య స్థితిని చూపించే ఎయిర్ సువిధ ఫారమ్‌లు తప్పనిసరిగా నింపాలని ఎయిర్ ఇండియా సూచించింది.