ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో మంటలు చెలరేగాయి. టేకాఫ్కు ముందు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విమానంలో మొత్తం సిబ్బంది, ప్రయాణికులు 145 మంది ఉండగా.. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. వారందరినీ వెంటనే విమానం నుంచి కిందకు దింపేశారు. వారందరినీ టెర్మినల్ భవానానికి తరలించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ లోని మస్కట్ ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానం కొచ్చికి బయల్దేరిన కొద్ది సేపటికే మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రయాణికులందరినీ ప్రత్యామ్నాయ విమానంలో తరలిస్తామని చెప్పారు.
రెండు నెలల క్రితం కాలికట్ నుంచి దుబాయ్ కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మస్కట్ కు మళ్లించాల్సి వచ్చింది. ఇండిగో విమానంలోని ఇంజిన్ లో అసాధారణ ప్రకంపనలు రావడంతో ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్తున్న ఫ్లైట్ ను ముందుజాగ్రత్త చర్యగా జైపూర్ కు తరలించారు. షార్జా నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన మరో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై పాకిస్థాన్ లోని కరాచీకి తరలించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులోని ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
