అమ్మకానికి ఎయిరిండియా రెడీ

అమ్మకానికి ఎయిరిండియా రెడీ

వచ్చే నెల నుంచి బిడ్స్‌ కు ఆహ్వానం
మొత్తం వాటా అమ్మనున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: అప్పుల కుప్పగా మారిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను వదిలించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కంపెనీలో మొత్తం వాటాలను అమ్మడానికి వచ్చే నెల ప్రాథమిక బిడ్స్‌‌ను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఎయిరిండియాను దక్కించుకోవడానికి ఇది వరకే కొన్ని కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ ప్రభుత్వరంగ కంపెనీకి ఇప్పటి వరకు రూ.58 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. మరోవైపు నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనిని అమ్మడానికి అవసరమైన ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఆఫ్‌‌ ఇంట్రెస్ట్‌‌ (ఈఓఐ) డాక్యుమెంట్లకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వందశాతం వాటాల అమ్మకం కోసం ఈఓఐ ద్వారా బిడ్స్‌‌ను ఈ నెల లేదా వచ్చే నెల ఆహ్వానిస్తారని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ఇందుకోసం కొత్తగా రూపొందించిన తయారు చేసిన ఈ–బిడ్డింగ్‌‌ విధానం ద్వారా ఈఓఐలను ఆహ్వానిస్తారు. ఈ నెల 22న ఎయిరిండియా బోర్డు మీటింగ్‌‌ జరగనుండగా, కేంద్ర పౌర విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్‌‌ సింగ్‌‌ ఖరోలా గత వారం సమీక్షా సమావేశం నిర్వమించారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తయారు చేసిన కన్సాలిడేటెడ్‌‌ అకౌంట్‌‌ స్టేట్‌‌మెంట్‌‌కు ఆమోదం తెలపడానికి ఈ మీటింగ్‌‌ నిర్వహించారు.

సంస్థను ప్రైవేటీకరించే విషయమై ఎయిరిండియా యాజమాన్యం గత నెల ట్రేడ్‌‌ యూనియన్లతోనూ సమావేశం నిర్వహించింది. ఇదే జరిగితే తమ ఉద్యోగాలు పోతాయంటూ మెజారిటీ సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. సంస్థ బ్యాలన్స్‌‌ షీట్‌‌ను సంస్కరించడానికి కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పుల్లో రూ.30 వేల కోట్ల వరకు తీర్చడానికి ఎయిరిండియా అసెట్‌‌ హోల్డింగ్‌‌ లిమిటెడ్‌‌ (ఏఐఏహెచ్‌‌ఎల్‌‌) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఇది జారీ చేసే బాండ్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని అప్పుల చెల్లింపునకు ఉపయోగిస్తారు. ఈ సంస్థ ఇది వరకే బాండ్ల ద్వారా రూ.21, 985 కోట్లు సేకరించింది. ఇదిలా ఉంటే, జీతభత్యాలు పెంచకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో  పైలెట్లు సామూహికంగా రాజీనామాలు చేశారు. ఎయిర్‌‌బస్‌‌ ఏ-320 విమానాలు నడిపే 120 మంది పైలెట్లు జీతాలు, ప్రమోషన్ల కోసం మేనేజ్‌‌మెంట్‌‌కు ఇచ్చిన వినతిపత్రాలకు స్పందన రాకపోవడంతో ఇటీవల రాజీనామాలు అందజేశారు. అంతేగాక ఆయిల్‌‌ మార్కెటింగ్ కంపెనీలకు ఇంధన బిల్లులు కూడా చెల్లించడానికి కూడా ఎయిర్‌‌ఇండియా వద్ద నిధులు కరువయ్యాయి. దీంతో విమానాలకు ఇంధన సరఫరాను నిలిపివేస్తామని ఆయిల్‌‌ మార్కెటింగ్‌‌ కంపెనీలు హెచ్చరించాయి.