 
                                    న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం, 2025, మే నెలలో ఇండియా--పాకిస్తాన్ సైనిక ఘర్షణల కారణంగా భారత విమానాలకు పాక్ గగనతలం క్లోజ్ చేయడం వంటి కారణాలతో దేశీయ ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఆర్ధిక సమస్యల్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా యజమానులు టాటా సన్స్ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను 1.14 బిలియన్ డాలర్లు (ఇండియా కరెన్సీలో 10 వేల కోట్లు) ఆర్ధిక సహయం చేయాలని కోరినట్లు సమాచారం.
ఈ మేరకు బ్లూమ్‌బెర్గ్ ఒక నివేదిక ప్రచురించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఎయిర్ ఇండియా సేవలను అప్‌గ్రేడ్ చేయడం, ఇంటర్నల్ ఇంజనీరింగ్ వర్క్స్, సంస్థ నిర్వహణ విభాగాలను మరింత పటిష్టం చేయడానికి ఆర్ధిక సహయం చేయాలని టాటా గ్రూప్ సింగపూర్ ఎయిర్ లైన్స్‌ను కోరింది. ఈ నివేదికను టాటా గ్రూప్ ఇంకా ధృవీకరించలేదు. కాగా, ఎయిర్ ఇండియాలో టాటా గ్రూప్‌కు 74.9 శాతం వాటా ఉండగా.. మిగిలిన వాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్ వద్ద ఉంది.
2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 26 మంది మరణించారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో ఇండియా, పాక్ మధ్య సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలో ఇండియా విమానాలకు పాక్ తన గగనతలంపై ఆంక్షలు విధించింది. పాక్ నిర్ణయం ఇండియా ఎయిర్ లైన్స్ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించింది. పాకిస్తాన్ గగనతలంపై ఆంక్షలు విధించిన తర్వాత ఎయిర్ ఇండియాకు రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ నష్టం నుంచి తేరుకోకముందే.. 2025, జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 270 మంది మరణించారు. ఈ ఘటన కూడా ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపించింది. వరుస ఎదురు దెబ్బలు తగలడంతో ఎయిర్ ఇండియా ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ఆర్ధిక సహయం చేయాలని సింగపూర్ ఎయిర్ లైన్స్ ను టాటా గ్రూప్ కోరింది.
 

 
         
                     
                     
                    