జుట్టు ఊడేవాళ్లు గుండు చేయించుకోండి.. సిబ్బందికి ఎయిర్ ఇండియా కొత్త రూల్స్

జుట్టు ఊడేవాళ్లు గుండు చేయించుకోండి..  సిబ్బందికి ఎయిర్ ఇండియా కొత్త రూల్స్

ఎయిర్ ఇండియా‌ కంపెనీ తమ పురుష సిబ్బందికి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. తప్పనిసరిగా హెయిర్ జెల్ వాడాలని వారికి నిర్దేశించింది. బట్టతల ఉన్నవారు, జుట్టు ఎక్కువగా ఊడేవాళ్లు గుండు చేయించుకొని విధులకు హాజరు కావాలని సూచించింది.  తెల్లవెంట్రుకలు ఉన్నవారు జుట్టుకు రంగు వేసుకోవాలని తెలిపింది. ప్రతిరోజూ షేవ్ తప్పని సరి అని మార్గదర్శకాల్లో ఎయిర్ ఇండియా‌ యాజమాన్యం స్పష్టం చేసింది.  

మహిళా సిబ్బందికి మార్గదర్శకాలివీ..

మహిళా సిబ్బందికి కూడా ప్రత్యేక మార్గదర్శకాలను ఎయిర్ ఇండియా‌  విడుదల చేసింది.   మహిళా సిబ్బంది జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్ లో ఉండే రంగులు వేసుకోవాలని నిర్దేశించింది. ముత్యాల చెవిపోగులు ధరించకూడదని తెలిపింది. డిజైన్ లేకుండా బంగారం, డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలని చెప్పింది. రింగ్స్ వెడల్పు 1సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉండకూడదని తేల్చి చెప్పింది.  మణికట్టు, మెడ, చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు కట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. ఎయిర్ హోస్టెస్ చేతికి డిజైన్ బ్యాంగిల్స్ ధరించకూడదు. లిప్‌స్టిక్, నెయిల్ పెయింట్ తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మార్గదర్శకాల్లో ఎయిర్ ఇండియా వివరించింది.   

ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన తర్వాత మిగిలిన సంస్థల మాదిరిగా లాభాల బాటలో నడిపించేందుకు ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే అన్ని విభాగాల్లో కీలక మార్పులు చేస్తోంది. ఎయిర్ హోస్టెస్, సిబ్బంది ప్రవర్తన, వస్త్రధారణ తదితర విషయాలపై ప్రత్యేక ఫోకస్ చేస్తోంది.