గాలి లేని టైరు.. పంక్చర్ కాదు..!

గాలి లేని టైరు.. పంక్చర్ కాదు..!

ఇదిగిదిగో ఇక్కడ కనిపిస్తున్నవి వీల్స్ కాదు. ట్వీల్స్! మామూలు వీల్స్ పంచర్లు పడతయ్. అరిగిపోతయ్. ట్వీల్స్ అంత తొందరగా అరగవు. అసలు వీటిలో గాలి ఉంటే కదా పంచర్లు పడనీకి. పొరబాటున బండి పెద్ద రాయి ఎక్కిందనుకోండి, స్పాంజి లెక్క ట్వీల్ అంతవరకూ లోనికి ముడుచుకుంటది. రాయి దిగగానే మామూలైపోద్ది. మామూలు బండ్లకు వీల్, టైరు వేర్వేరుగా ఉంటాయి. కానీ వీటిలో వీల్, టైరు కలిసిపోయి ఉంటాయి. అందుకే దీనికి ట్వీల్ అని పేరు పెట్టారు. ఫ్లెక్సిబుల్ పాలీ రెసిన్ తో తయారు చేసిన స్పోక్స్ (పుల్లలు), టైరును వీల్‌‌తో కలుపుతుంటాయి. ట్వీల్స్ మందం చాలా తక్కువ. ఇళ్లలో ఉండే సన్నటి గోడంత మందం ఉంటుందంతే. వీటికి పంక్చర్లు పడవు. పెద్ద పెద్ద మేకులపై పోనిచ్చినా సరే! ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టైర్ల తయారీ కంపెనీ మిషిలాన్, ట్వీల్స్ రూపొందిస్తోంది.

 

ప్రస్తుతం ‘జాన్ డీర్ జెడ్740ఆర్ జెడ్ ట్రాక్’ మోడల్ ట్రాక్టర్లకు అనువుగా ఓ ట్వీల్ ను తయారు చేసింది. పైన ఫొటో చూపించిన ట్వీల్ ట్రాక్టర్‌‌దే. ట్వీల్స్‌‌తో పొలంలో ట్రాక్టర్ ను పోనిస్తే, దాని గుర్తులు పడుతున్నాయి. రోడ్లపైనా అలాగే జరుగుతోంది. దీంతో ట్వీల్స్ ను రోడ్లపై వాడకానికి అనుగుణంగా మార్చాలని మిషిలాన్ భావిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్వీల్స్‌‌తో గంటకు 80.46 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయొచ్చు. ప్రస్తుతం ట్రాక్టర్లకు అమర్చుతున్న ట్వీల్స్ ధర మామూలు టైర్లతో పోలిస్తే బాగా ఎక్కువ. ఒక్కో ట్వీల్ ఖరీదు 41 వేల రూపాయల పైమాటే. త్వరలో కార్లకు అనుగుణంగా టైర్లు తయారు చేసి అందుబాటులోకి తేవాలని మిషిలాన్ చూస్తోంది. 2025 కల్లా ఇవి అన్ని వాహనాలకు అనుగుణంగా మార్కెట్లోకి రిలీజ్ అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.