స్పెక్ట్రం అమ్మకానికి రెడీ

స్పెక్ట్రం అమ్మకానికి రెడీ
  • టెల్కోలతో ఎయిర్‌సెల్‌ ఆర్పీ చర్చలు
  • వ్యతిరేకిస్తున్న డీఓటీ

తన దగ్గరున్న స్పెక్ట్రమ్‌ ను అమ్మడానికి ఎయిర్‌ సెల్‌ ఇతర టెల్కోలతో చర్చలు జరుపుతుండగా, డీఓటీ మాత్రం ఎయిర్‌ సెల్‌ ను తప్పుబడుతోం ది. స్పెక్ ట్రం ప్రభుత్వ ఆస్తి కాబట్టి టెల్కోలకు దీనిని కొంతకాలం ఉపయోగించుకునే అధికారం మాత్రమే ఉంటుందని, అమ్మడం సాధ్యం కాదన్నదని డీఓటీ వాదన. ఈ వివాదంపై ఎన్సీఎల్టీలో విచారణ కూడా జరుగుతోంది.

ముంబై: తన దగ్గరున్న స్పెక్ట్రమ్‌‌ను అమ్మడానికి ఎయిర్‌‌సెల్‌‌ రిజల్యూషన్‌‌ ప్రొఫెషనల్‌‌ (ఆర్పీ), మరో కంపెనీ యూవీ అసెట్‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌ (యూవీఏఆర్సీఎల్‌‌).. ఎయిర్‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా, రిలయన్స్‌‌ జియోతో చర్చలు ప్రారంభించాయి. ఆర్థిక సమస్యల కారణంగా ఎయిర్‌‌సెల్‌‌ దివాలా తీసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం వేలం ద్వారా స్పెక్ట్రమ్‌‌ను అమ్మే అధికారం టెలికంశాఖ (డీఓటీ)కు మాత్రమే ఉంటుందన్న ప్రభుత్వం వాదిస్తోంది. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్‌‌ (సీఓసీ) అనుమతించిన అప్పుల పరిష్కార ప్రక్రియ ద్వారా డీఓటీకి రూ.2–3 కోట్లకు మాత్రమే వస్తున్నాయి. ఎయిర్‌‌సెల్‌‌ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరించాలని ఈ సంస్థ కోరుకుంటున్నది. ఆర్పీ డెలాయిట్‌‌ మాత్రం రూ.రెండు వేల కోట్లకు ఆమోదం తెలిపింది. స్పెక్ట్రం సార్వభౌమ ఆస్తి కాబట్టి టెల్కోలకు దీనిని ఉపయోగించుకునే అధికారం మాత్రమే ఉంటుందని, అమ్మడం సాధ్యం కాదన్నదని డీఓటీ వాదన. అయినప్పటికీ 900 మెగాహెజ్‌‌, 1800 మెగాహెజ్‌‌ బ్యాండ్ల స్పెక్ట్రం అమ్మకం కోసం యూవీఏఆర్సీఎల్‌‌ అన్ని టెల్కోలతో చర్చలు జరపడం గమనార్హం. ఎయిర్‌‌సెల్‌‌ దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తి స్పెక్ట్రమే కావడంతో దీనిపై కంపెనీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీని దగ్గరున్న స్పెక్ట్రం బ్యాండ్ల గడువు 2026 (తమిళనాడు మినహా) వరకు ఉంది. బేస్‌‌ ధరలో 10 శాతం తగ్గించడం ద్వారా స్పెక్ట్రంను సులువుగా అమ్మవచ్చని ఎయిర్‌‌సెల్‌‌ భావిస్తోంది. తమ దగ్గర రూ.1,100–రూ.2,000 కోట్ల విలువైన స్పెక్ట్రం ఉందని ఇది వరకే ఎన్సీఎల్టీకి తెలిపింది. తాజా పరిణామాలపై స్పందించడానికి ఎయిర్‌‌టెల్‌‌, జియో, ఎయిర్‌‌సెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా, డెలాయిట్‌‌, యూవీఏఆర్సీఎల్‌‌ ప్రతినిధులు నిరాకరించారు.

క్రెడిటర్లకు నిరాశే…

సీఓసీ ఆమోదించిన అప్పుల పరిష్కార ప్లాన్‌‌లో ఆపరేషనల్‌‌ క్రెడిటర్లకు రూ.100 కోట్ల కంటే తక్కువే కేటాయించారు. ఎయిర్‌‌సెల్‌‌ ఆస్తుల విలువను భారీగా తగ్గించారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు వెల్లడించారు. ఫైనాన్షియల్‌‌ క్రెడిటర్లకు రూ.మూడు వేల కోట్లకు (20 శాతం) మించి రాకపోవచ్చని అన్నారు.  ఎన్సీఎల్టీలో విచారణ సందర్భంగా డీఓటీ స్పందిస్తూ ఎయిర్‌‌సెల్‌‌ తన దగ్గరున్న స్పెక్ట్రమ్‌‌ను తమకు అప్పగించాలని, దీనిని మార్కెట్‌‌ రేట్ల ప్రకారం వేలం వేస్తామని ప్రకటించింది. ఎయిర్‌‌సెల్‌‌ నుంచి తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవాల్సి ఉన్నా, ఆస్తుల విలువను భారీగా తగ్గించినందున ఏమీ చేయలేకపోతున్నామని పేర్కొంది. స్పెక్ట్రమ్‌‌తోపాటు ఎంటర్‌‌ప్రైజ్‌‌ బిజినెస్‌‌, ఫైబర్‌‌, భూముల వంటి ఆస్తులను ఎయిర్‌‌సెల్‌‌ అమ్మకానికి పెట్టింది.

విచారణ అనంతరం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్‌‌ స్పందిస్తూ ప్రభుత్వం తన బకాయిలను ఎలా వసూలు చేసుకోవచ్చో తెలియజేస్తూ డీఓటీకి ప్రతిపాదన పంపాలని డెలాయిట్‌‌ను ఆదేశించింది. రూ.20 వేల కోట్ల అప్పులను చెల్లించలేక దివాలా తీసినట్టు ఎయిర్‌‌సెల్‌‌ 2018లో ప్రకటించింది. ఆస్తుల పునర్‌‌వ్యవస్థీకరణ బాధ్యతలను సీఓసీ యూవీఏఆర్సీఎల్‌‌కు అప్పగించింది. అసెట్‌‌ రీకన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీని నియమించాలన్న పిటిషన్‌‌పై ఎన్సీఎల్టీలో విచారణ పెండింగ్‌‌లో ఉంది. ఎయిర్‌‌సెల్‌‌ మాదిరే ఆర్‌‌కామ్‌‌ కూడా దివాలా తీసింది. స్పెక్ట్రమ్‌‌ అమ్మకంపై ఇది డోఓటీతో న్యాయ పోరాటం చేస్తోంది. తన అన్న టెలికం కంపెనీ జియోకు రూ.23 వేల కోట్ల స్పెక్ట్రమ్‌‌ను అమ్మడానికి అనిల్‌‌ అంబానీ కంపెనీ ఆర్‌‌కామ్‌‌ ప్రయత్నించగా, డీఓటీ అడ్డుకుంది. తనకు రావాల్సిన బకాయిలకు హామీ ఇవ్వాలని కోరగా, జియో ఇందుకు తిరస్కరించింది. 2016లో జియో అడుగుపెట్టిన తరువాత ఎయిర్‌‌సెల్‌‌, ఆర్‌‌కామ్‌‌, యూనినార్‌‌, టాటా డొకొమో వంటి చిన్న కంపెనీలు దివాలా తీశాయి. అత్యంత చవక ధరలకే జియో డేటా, వాయిస్‌‌ కాలింగ్‌‌ సేవలను అందించడంతో మిగతా కంపెనీలు పోటీపడలేకపోయాయి. దీంతో డొకొమో, వొడాఫోన్‌‌ వంటి కంపెనీలు ఇతర టెల్కోలతో విలీనమయ్యాయి.