నార్త్ ఇండియాలో హై ఎలర్ట్

నార్త్ ఇండియాలో హై ఎలర్ట్

న్యూఢిల్లీఉత్తర భారతదేశంలో హై ఎలర్ట్‌‌‌‌ ప్రకటించారు. జైషే మహ్మద్‌‌‌‌ టెర్రరిస్టులు దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న ఇంటలిజెన్స్‌‌‌‌ హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లలో హైఎలర్ట్‌‌‌‌ ప్రకటించారు. సెక్యూరిటీ పెంచి తనిఖీలు చేస్తున్నారు. జైషే మహ్మద్‌‌‌‌కు చెందిన నలుగురు టెర్రరిస్టులు ఢిల్లీలోకి ప్రవేశించారని, వారి దగ్గర భారీగా ఆయుధాలు ఉన్నాయన్న సమాచారం రావటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సెక్యూరిటీ అధికారులు చెప్పారు. దేశ రాజధానిలో కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. దుర్గా పూజ, రామ్‌‌‌‌లీలా సందర్భంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.  దేశంలోకి చొరబడేందుకు వందలాది మంది టెర్రరిస్టులు ఎల్‌‌‌‌వోసీ వెంట కాసుకొని ఉన్నారని, వారంతా బాలాకోట్‌‌‌‌లోని జైషే మహ్మద్‌‌‌‌ క్యాంప్‌‌‌‌లో ట్రైన్‌‌‌‌ అయినట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. సౌత్‌‌‌‌ ఇండియాలోని సముద్ర తీరంలో కూడా సెక్యూరిటీ పెంచామని, సిర్‌‌‌‌‌‌‌‌క్రీక్‌లో కొన్ని పడవలను అదుపులోకి తీసుకున్నామని ఆర్మీ అధికారులు చెప్పారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టికల్‌‌‌‌ 370 రద్దు తర్వాత దాడులు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్‌‌‌‌ అధికారులు మొదటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

ఢిల్లీలో హైసెక్యూరిటీ

ఢిల్లీ స్పెషల్‌‌‌‌ పోలీసులు సిటీని జల్లెడ పడుతున్నారు. హైసెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 15 జిల్లాల పరిధిలోని భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే, మెట్రో, బస్‌‌‌‌ స్టేషన్లలో యాంటీ టెర్రరిస్ట్‌‌‌‌ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజిలను క్షుణంగా పరిశీలిస్తున్నామని, అనుమానం వచ్చిన ఏ ఒక్కణ్ణి వదిలి పెట్టడం లేదని చెప్పారు. గెస్ట్‌‌‌‌ హౌస్‌‌‌‌లు, హోటళ్ల నుంచి సిటీలోకి కొత్తగా వచ్చిన వారి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. దుర్గా మండపాల దగ్గర ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

ఎల్వోసీ వెంట పాక్‌‌‌‌ కవ్వింపు చర్యలు

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని పూంచ్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌ కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌‌‌‌ సైనికులు షాహ్పూర్‌‌‌‌‌‌‌‌ దగ్గర్లోని సాయి మీర్‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌ ఆలయంపై కాల్పులు జరిపారని అధికారులు చెప్పారు. ఆలయంలోని చాలా భాగం దెబ్బతిందన్నారు. గుడి దగ్గర్లోని షాపులపై దాడి చేయడంతో జనాలు పరుగులు పెట్టారన్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌లోని అఖ్నూర్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నలుగురు హిజ్బుల్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని కిష్టావర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో హిజ్బుల్‌‌‌‌ ముజాహుద్దీన్‌‌‌‌ టెర్రర్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌కు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. టెర్రర్‌‌‌‌‌‌‌‌ ఫ్రీగా ప్రకటించిన కిష్టావర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతం నుంచి ఈ మధ్య ముగ్గురు టెర్రరిస్టులు రావటంతో ఆ ప్రాంతంపై ఫోకస్‌‌‌‌ చేసిన పోలీసులు 45మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో 16 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. ఫరూక్‌‌‌‌భాట్‌‌‌‌, మంజర్‌‌‌‌‌‌‌‌ గనీ, మసూద్‌‌‌‌, నూర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌లను అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసు అధికారి చెప్పారు. వీళ్ల అరెస్టు వల్ల భారీ టెర్రర్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను కూల్చినట్లైందని అన్నారు. దోడా–కిష్టావర్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో టెర్రరిజమ్‌‌‌‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్న వారి కోసం సెర్చ్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ కొనసాగుతోందని సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారి అన్నారు.

సౌత్‌‌‌‌ ఇండియాలోనూ టెర్రర్‌‌‌‌‌‌‌‌ అటాక్స్‌‌‌‌ జరిగే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. సిర్‌‌‌‌‌‌‌‌ క్రీక్‌‌‌‌ నుంచి కొన్ని బోట్లను కూడా రికవర్‌‌‌‌‌‌‌‌ చేశాం. టెర్రర్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

–  లెఫ్టినెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎస్‌‌‌‌.కె. సైనీ